Share News

జై అమరావతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:22 AM

Celebrations over the approval of the 'Capital' bill రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించడంతో జిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా అంతటా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు.

జై అమరావతి
శ్రీకాకుళంలో ఎమ్మెల్యే శంకర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న కూటమి శ్రేణులు, ప్రజలు

‘రాజధాని’ బిల్లు ఆమోదంపై సంబరాలు

కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించడంతో జిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా అంతటా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు. ‘జై అమరావతి.. జై జై అమరావతి’ అంటూ రాష్ట్ర రాజధానిపై తమకున్న అభిమానాన్ని చాటెత్తారు. మరికొందరు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ.. కొవ్వొత్తులు వెలిగించారు. జిల్లాలో ఎక్కడ చూసినా సంబరాల్లో మునిగితేలారు.

ఇక ప్రజారాజధానిగా.. : మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి రాజధానిగా చట్టబద్ధత బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించడంపై వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల త్యాగాలకు న్యాయం చేసిన చారిత్రాత్మక ఘట్టమన్నారు. ‘ప్రజారాజధాని అమరావతి కోసం 29 వేల మంది రైతుల స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. 1600 రోజులపాటు నిరంతర పోరాటం చేసిన రైతులు, మహిళల ఉద్యమానికి సెల్యూట్‌. ఉద్యమ సమయంలో మహిళలను సైతం వదలకుండా జరిగిన దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలిచాయి. 12 ఏళ్లుగా రాజధానిపై కొనసాగిన అస్పష్టత.. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసిన గత ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టితో అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందేందుకు పునాది పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్‌ భారత్‌ సంకల్పం రాష్ట్ర అభివృద్ధికి బలమైన దిశను చూపుతోంది. అమరావతి గ్రామాలైన తుళ్లూరు, వెంకటపాలెం, మందడం, వెలగపూడి తదితర ప్రాంతాల్లో రైతులు, మహిళలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకోవడం ప్రజల ఆనందానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి సువర్ణ భవిష్యత్‌ అందిస్తుంది. అమరావతి నిత్యశాశ్వత రాజధానిగా నిలుస్తుంద’ని మంత్రి అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళంలో భారీ ర్యాలీ

శ్రీకాకుళంలో పాతబస్టాండ్‌లోని పొట్టిశ్రీరాముల విగ్రహం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యలో పొట్టిశ్రీరాములు, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్‌, కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడురోడ్లకూడలిలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ‘అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువు. రాజధాని కోసం 35 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిది. అమరావతి ద్వారా వచ్చే ఆదాయంతో అన్ని జిల్లాలకు లబ్ది చేకూరుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయ’ని తెలిపారు. అలాగే పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల్లోనూ... అన్ని మండల కేంద్రాల్లోనూ కూటమి శ్రేణులు, ప్రజలు.. సంబరాలు చేసుకున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:22 AM