Share News

జగ్జీవన్‌రామ్‌ ఆదర్శనీయుడు

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:24 AM

Jagjivan Ram jayanthi స్వేచ్ఛ, సమాత్వం కోసం నిరంతర పోరాటం చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవితం ఆదర్శనీయం. నేటి యువత ఆయన బాటలో నడిచి ఉన్నత శిఖరాలను చేరుకోవాల’ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

జగ్జీవన్‌రామ్‌ ఆదర్శనీయుడు
బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే శంకర్‌

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అరసవల్లి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘స్వేచ్ఛ, సమాత్వం కోసం నిరంతర పోరాటం చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవితం ఆదర్శనీయం. నేటి యువత ఆయన బాటలో నడిచి ఉన్నత శిఖరాలను చేరుకోవాల’ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాకుళంలోని అరసవల్లి మిల్లు జంక్షన్‌ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అరసవల్లి రోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో మంత్రి అచ్చెన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘రక్షణ, వ్యవసాయ, కార్మికశాఖ మంత్రిగా జగ్జీవన్‌రామ్‌ దేశానికి చేసిన సేవలు నిరుపమానం. 50ఏళ్లపాటు పార్లమెంట్‌ సభ్యుడిగా, 30 ఏళ్లు కేంద్రమంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. చదువుకుంటే అట్టడుగు నుంచి ఉన్నతస్థాయికి చేరుకోగలమని నిరూపించారు. జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కట్టుబడి, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నామ’ని తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. జగజ్జీవన్‌రాం త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ, సమర్థతకు మారుపేరుగా, అట్టడుగు స్థాయి నుంచి దేశంలోనే అత్యున్నత నాయకుడిగా ఎదిగిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవితం అత్యంత స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ కూర్మారావు, ఆర్డీవో సాయిప్రత్యూష, పీఎంజే బాబు, ఎస్వీ రమణ మాదిగ, రాయి వేణుగోపాల్‌, కంట వేణు, బోసు మన్మథరావు, డి.గణేష్‌, ఎం.చిన్నారావు, వి.యాదగిరి తదితరులు మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:24 AM