పర్యటన ఆసాంతం అరాచకమే
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:42 AM
Severe criticism over Jagan's Srikakulam tour వచ్చింది పరామర్శ కోసం.. నడిపింది ఆరుగంటల హైడ్రామా.. కార్యకర్తలు పోలీసులను నెట్టేసి కింద పడేయడం.. మహిళా ఎస్‌ఐ విధులకు ఆటంకం కలిగించి అసభ్యంగా ప్రవర్తించడం.. ఎప్పటిలాగే రఫ్ఫా రఫ్ఫా అంటూ కేకలు వేయడం..! జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన జరిగిన తీరిది.
పరామర్శ పేరిట ఆరుగంటల పాటు హైడ్రామా
పలుచోట్ల రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
పోలీసులను అడ్డుకుని కిందపడేసిన వైనం
మహిళా ఎస్‌ఐను తోసి అసభ్యకర ప్రవర్తన
జగన్ సిక్కోలు పర్యటనపై తీవ్ర విమర్శలు
జాతీయ రహదారిపై ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు
శ్రీకాకుళం, జూలై 30(ఆంధ్రజ్యోతి): వచ్చింది పరామర్శ కోసం.. నడిపింది ఆరుగంటల హైడ్రామా.. కార్యకర్తలు పోలీసులను నెట్టేసి కింద పడేయడం.. మహిళా ఎస్‌ఐ విధులకు ఆటంకం కలిగించి అసభ్యంగా ప్రవర్తించడం.. ఎప్పటిలాగే రఫ్ఫా రఫ్ఫా అంటూ కేకలు వేయడం..! జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన జరిగిన తీరిది. అంపోలు జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ మధ్యాహ్నం 2 గంటలకు రావాలి. కానీ విశాఖ నుంచే రోడ్డు పొడవునా బలప్రదర్శన చేస్తూ వచ్చారు. జైలు సమయం సాయంత్రం 5కి పూర్తవుతుందని తెలిసినా.. ఆతర్వాతే వచ్చారు. సీదిరి కుటుంబాన్ని పరామర్శించి.. ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని విమర్శించి.. సీదిరి అప్పలరాజు, ఆయన కొడుకు ఆరవ్ చేసిన నేరాన్ని సమర్థించుకుని వెళ్లిపోయారు. జగన్ పర్యటనలో పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. కొత్తరోడ్డు జంక్షన్ వద్ద మహిళా ఎస్‌ఐ ప్రవల్లిక విధులకు ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి రవికుమార్, ఆయన అనుచరులు ఆటంకం కలిగించారు. ఆమె చుట్టూ గుమిగూడి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ ఘటనను శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉంటే అంపోలు జంక్షన్ వద్ద అయితే వైసీపీ కార్యకర్తలు శృతిమించి వ్యవహరించారు. అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను పక్కకు తోసివేశారు. దీంతో బ్యారికేడ్ల మీద ఎస్‌ఐ, కొందరు కానిస్టేబుళ్లు కిందపడ్డారు. అంపోలు జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో నిబంధనలు అమలుచేస్తున్న పోలీసులపైనా కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. అలాగే జగన్ జిల్లా జైలు నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో కొంతమంది కార్యకర్తలు ‘రప్పా.. రప్పా’ అంటూ నినాదాలు చేస్తూ ఉండటం.. వాళ్లందరినీ చూసి జగన్ పొంగిపోవడం గమనార్హం. దీనికితోడు భోగాపురంలో శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో జగన్ పర్యటనకు కొన్ని షరతులు విధించారు. వైసీపీ నాయకులు కూడా ఇందుకు అంగీకరించారు. అయితే గురువారం నాటి జగన్ పర్యటనలో ఈ నిబంధనలను జగన్‌తో పాటు వైసీపీ కార్యకర్తలు తుంగలో తొక్కారు. దీనికితోడు అరాచకం సృష్టించారు.
నరకం చవిచూసిన జిల్లా ప్రజలు..
వైఎస్ జగన్ విశాఖలో గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరారు. జిల్లాకు సాయంత్రం 5.10 గంటలకు చేరుకున్నారు. హైవేపై కొన్ని గంటలపాటు రోడ్‌షో చేసి.. జిల్లా జైలుకు(అంపోలు) వచ్చి మళ్లీ వెళ్లిన జగన్‌కు పోలీసులు ఆసాంతం కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే.. జగన్ రోడ్‌షో వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. హైవేపై నిలిచిన వాహనాలతో అవస్థలు పడ్డారు. రణస్థలంలో ప్రజలు, వాహనదారులకు అవస్థలు ఎదురయ్యాయి. వైసీపీ నేతల వాహనాల కాన్వాయ్, ఆపై వైసీపీ శ్రేణుల జన సమీకరణతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు విడిచిపెట్టే సాయంత్రం వేళ పాఠశాల, కాలేజీ బస్సులు సైతం అందులో చిక్కుకున్నాయి. విద్యార్థులకు అసౌకర్యం తప్పలేదు. శ్రీకాకుళం కొత్తరోడ్ నుంచి అంపోలు జంక్షన్ వరకు పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వినా.. సంయమనం కోల్పోకుండా పోలీసులు జాగ్రత్త వహించారు.