అక్కడ కఠినం.. ఇక్కడ చోద్యం!
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:25 AM
Cows smuggling జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు ఇచ్ఛాపురం నియోజకవర్గం అడ్డాగా మారింది. ఒడిశా నుంచి పశువులను ఇక్కడికి తెచ్చి.. సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్నింటిని స్థానికంగానే కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఒడిశా నుంచి జిల్లాకు పశువులు
ఇచ్ఛాపురం కేంద్రంగా అక్రమ రవాణా
సరిహద్దు చెక్‌పోస్టుల మూతతో బరితెగింపు
ఈ నెల 20న పురుషోత్తపురం సమీపంలో రైల్వేమార్గం చెంతనే పశువులు తరలిస్తున్న వ్యాన్ పట్టుబడింది. ఒడిశాలోని పితాతొళి గ్రామస్థులు ఆ వ్యాన్‌ను వెంటాడి పట్టుకున్నారు. ఆ వ్యాన్‌లో అమానుషంగా 18 పశువులను కుక్కి.. తాళ్లతో బంధించి తరలిస్తుండగా అందులో మూడు ఆవులు మృతి చెందాయి.
ఒడిశాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ గోసంరక్షణకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్ సంఘాలు, విశ్వహిందూపరిషత్ నడుం బిగించాయి. ఈ క్రమంలో ఒడిశాలో కొనుగోలు చేసి తరలిస్తున్న పశువులను స్థానికులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. చీకటి బ్లాక్ మాజీ చైర్మన్ కోడలు వాసంతి గోసంరక్షణకు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పశువులను ఇచ్ఛాపురం తీసుకొస్తుండగా అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
ఇచ్ఛాపురం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు ఇచ్ఛాపురం నియోజకవర్గం అడ్డాగా మారింది. ఒడిశా నుంచి పశువులను ఇక్కడికి తెచ్చి.. సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్నింటిని స్థానికంగానే కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కవిటి మండలం కొజ్జిరియా, రాజపురం, తొత్తిడిపుట్టుగ, శిలగాం, నర్తుపుట్టుగ తదితర గ్రామాల నుంచి పశువులు తరలిపోతున్నాయి. ఒడిశాలోని చీకటి, బరంపురం, ముఖరాంపురంతో పాటు మిగతా సంతల్లో రైతుల నుంచి కొంతమంది దళారులు పశువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చుతారు. రాత్రిపూట లారీలు, ఇతర వాహనాల్లో కుక్కి తరలిస్తుంటారు. మరికొందరైతే కంటైనర్లలో రహస్యంగా రవాణా చేస్తున్నారు. సంతలు, కళేబరాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒడిశాలో పశువుల అక్రమ రవాణాపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందుకే అక్కడ కొనుగోలు చేసి అక్రమ మార్గంలో ఇక్కడకు తెస్తున్నారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, పలాస పరిధిలోని 20 పైగా ఒడిశా నుంచి వచ్చే సరిహద్దు మార్గాలున్నాయి. ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురంలో మాత్రమే పోలీస్‌తనిఖీ కేంద్రం ఉంది. ప్రధానంగా ఇచ్ఛాపురం మండలం టి.బరంపురం, పెద్దలక్ష్మీపురం, కొళిగాం, ముచ్చింద్రా మార్గాల గుండా ఒడిశా నుంచి పశువులు ఇచ్ఛాపురం వైపు తెస్తున్నారు. కంచిలి మండలానికి సంబంధించి కేశుపురం, బైరిపురం, సోంపేటలో పిరియాసాయి, కొంగాపూర్ నుంచి బాతుపురం, ఎంజీపురం, పొత్తంగి మీదుగా.. రవాణా చేస్తున్నారు. మందస మండలానికి సంబంధించి తుంబకొండ నుంచి అంబటికంబరం, సింగుపురం మీదుగా పశువులను తీసుకొస్తున్నారు. గతంలో ఈ మార్గాల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఉండేవి. కానీ కొన్నాళ్ల కిందట వాటిని తొలగించడంతో పశువుల రవాణా ఆగడం లేదు.
కానరాని నిబంధనలు
పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చునే వెసులబాటు ఉండాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించకుండానే పశువుల అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహరం వేయడం లేదు. దీంతో ఆకలికి, దప్పికతో అలమటించే పశువులు మార్గమధ్యంలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
ఒడిశాలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అందుకే ఏపీకి తీసుకొచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంతకంటే మహా పాపం ఉంటుందా? అందుకే మూగజీవాల సంరక్షణకు నడుం బిగించాం. ఒడిశాలో రైతుల వ్యవసాయ అవసరాలకు మాత్రమే పశువులు కొనుగోలుకు అనుమతులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తే కుదరదు. ఏపీ ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి.
- వాసంతి, గోసంరక్షణ సంస్థ ప్రతినిధి, పితాతొళి
దృష్టి పెడతాం..
పశువుల అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి పెట్టాం. అక్రమంగా రవాణా చేస్తే చర్యలు చేపడతాం. జాతీయ రహదారిపై నిఘా పెంచాం. గ్రామీణ రహదారులపై కూడా తనిఖీలు ముమ్మరం చేస్తాం.
- చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం