ఇంటర్ పరీక్షలకు వేళాయే
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:42 PM
Inter exams ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మంగళవారంతో ప్రాక్టికల్స్ ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు జరగనున్నాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 39,838 మంది పరీక్షలు రాయనున్నారు.
ఈ నెల 23 నుంచి నిర్వహణకు ఏర్పాట్లు
‘ప్రథమ’ విద్యార్థులకు ఐదు ప్రశ్నపత్రాలే
ద్వితీయ సంవత్సరానికి పాత విధానమే
నరసన్నపేట, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మంగళవారంతో ప్రాక్టికల్స్ ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు జరగనున్నాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 39,838 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 71 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. 71 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 831 మంది ఇన్విజలేటర్లను సిద్ధం చేశారు. సీసీ కెమెరాల నిఘా నడుమ పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేలా రోజుకొక పరీక్షను మాత్రమే నిర్వహిస్తారు. గతంలో ఇంటర్ పరీక్షలు 16 రోజులపాటు నిర్వహించగా.. ఈ ఏడాది 23 రోజులకు పెంచారు. ఇప్పటివరకు ఇంటర్‌లో ఆరు ప్రశ్నపత్రాలుండగా.. వీటిని ఐదుకు కుదించారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఐదు ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహిస్తారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం పాతపద్ధతిలోనే పరీక్ష ఉంటుంది.
రోజుకో పరీక్ష
ఈ ఏడాది ఇంటర్‌లో తొలుత సైన్స్ విద్యార్థులకు లాంగ్వేజ్‌తోపాటు గ్రూప్ సబ్జెక్టుల్లో ఒక పరీక్ష నిర్వహిస్తారు. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్ట్ పరీక్ష ఉన్నప్పుడు.. అదేరోజు బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులకు ఇతర సబ్జెక్ట్‌ల్లో పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్ట్‌కు మాత్రమే పరీక్ష ఉంటుంది. ఎంబైపీపీ గ్రూప్‌ను తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులూ జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు. కాబట్టి ఒకరోజు ఒక పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్రూప్‌లకు పరీక్షలు ప్రారంభమవుతాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. పూర్తిగా ఎన్‌సీఆర్టీ సిలబస్‌ను అమలు చేశారు. ఎంబైపీసీ, జీవశాస్త్రంలో ఎంపీపీ చదువుకునే వెలసుబాటు కల్పించారు. ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్ సబ్జెక్ట్‌లను ఎంచుకున్నారు. కొందరు సైన్స్ గ్రూపు విద్యార్థులు రాజనీతిశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం ఎంపిక చేసుకున్నారు.
బైపీపీ విద్యార్థులకు మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్షకు 455, ప్రాక్టికల్స్‌కు 45 మార్కులు కేటాయించారు. గతంలో బోటనీ, జువాలజీల్లో సబ్జెక్ట్‌లకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ఈ రెండు సబ్జెక్ట్‌లను కలిపి ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌లకు థియరీలో 85 మార్కులు చొప్పున, ప్రాక్టికల్స్ 15 మార్కులకు చొప్పున నిర్వహించనున్నారు. బయాలజీలో వేర్వేరుగా మూల్యంకనం చేసేందుకు వీలుగా వేర్వేరు జవాబుపత్రాల్లో పరీక్ష రాయాలి. పరీక్షల విధానంలో మార్పులపై ఇప్పటికే ఇంటర్ బోర్డు మూడు సార్లు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించింది.
ఎంపీసీ విద్యార్థులకు సంబందించి గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ గ్రూప్ సబ్జెక్ట్‌లు, రెండు భాషల సబ్టెక్జ్‌లకు సంబంధించి 500 మార్కులకు ఐదు పేపర్లతో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్షకు 470 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు కేటాయించారు. రెండు భాషల సబ్జెక్ట్‌లకు ఒక్కొక్కటి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇప్పటివరకు గణితం రెండు పేపర్లలో 1ఏ, 1బీ పేరుతో ఒక్కపేపరు 75 మార్కులు చొప్పన 150 మార్కులకు పరీక్ష ఉండేది. ఈ ఏడాది నుంచి రెండు పేపర్లు కలిపి ఒకే పేపరుగా 100 మార్కులుగా నిర్వహిస్తారు. గతంలో ఫిజిక్స్ 60 మార్కులు, కెమిస్ట్రీ 60 మార్కులు చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. ఈ సారి ఫిజిక్స్ 85 మార్కులు, కెమిస్ర్టీ 85 మార్కులు చొప్పున రాతపరీక్ష మిగతా 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించారు. ఆర్ట్స్ విద్యార్థులకు కూడా ఐదు పేపర్లు మాత్రమే ఉంటాయి.