మహాశివరాత్రి ఉత్సవాలకు వేళాయే
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:38 PM
Celebrations at Srimukhalingam శ్రీముఖలింగ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 18 వరకు వేడుకలు నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీముఖలింగంలో రేపటి నుంచి వేడుకలు
పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు
జలుమూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 18 వరకు వేడుకలు నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పర్యటించి.. ఆలయంలో ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఉత్సవాలు ఇలా..
15న మహాశివరాత్రి జాగరం
16న పడియా
17న మహాపడియా
18న వంశధార నదిలో శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తారు. చక్రతీర్థ స్నానాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.
ఆలయ విశిష్టత
పరమ శివుడు ముఖాకృతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న ఏకైక ఆలయం శ్రీముఖలింగం. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే ముక్తికి మార్గం దొరుకుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం శ్రీకాకుళానికి 50 కి.మీ దూరంలో జలుమూరు మండలం శ్రీముఖలింగంలో పవిత్ర వంశధార నది ఒడ్డున విలసిల్లి ఉంది. క్రీ.శ.720 నుంచి 1450 వరకు రాజ్యం చేసిన గంగవంశీకులైన ఒకటవ కామార్ణవునితో ఈ ఆలయం నిర్మాణం ప్రారంభమైనట్లు శాసనాలు ఆధారంగా తెలుస్తోంది. క్రీ.శ.14వ శతాబ్దంలో శిథిలమైన ఆలయాన్ని పర్లాకిమిడి ప్రభువు శ్రీవిష్ణువర్దన మధుకర్ల గజపతి పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయంపై అద్భుత శిల్పాలు మనకు దర్శనమిస్తాయి.
శ్రీముఖలింగంలో మూడుచోట్ల ముక్కోణం ఆకారంలో మూడు ఆలయాలు వున్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వరాలయం. దీనికి అభిముఖంగా కొంతదూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాలకు కాస్తదూరంగా ఊరి ప్రారంభంలో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వరాలయం సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది.