Share News

ఎగుమతులకు వేళాయే!

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:26 PM

దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై గతంలో అమెరికా విధించిన ఆంక్షలను ప్రస్తుతం ఆ దేశం సడలించింది.

 ఎగుమతులకు వేళాయే!
జీడిపిక్కలను పీలింగ్‌ చేస్తున్న కార్మికులు

- జీడిపప్పుపై సుంకాలు తగ్గించిన అమెరికా

- అదే బాటలో భారత్‌

- జీడి ఎగుమతులు మరింత పెరిగేందుకు అవకాశం

పలాస, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై గతంలో అమెరికా విధించిన ఆంక్షలను ప్రస్తుతం ఆ దేశం సడలించింది. అలాగే మన దేశం కూడా పలు ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తేసింది. ఇందులో జీడిపప్పు కూడా ఉంది. దీంతో దేశీయ జీడి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత భారత్‌పై భారీ సుంకాలను విధించారు. చాలా వస్తువులపై 70 నుంచి 80శాతం వరకు సుంకాలు పెంచారు. దీనికి ప్రతీకారంగా మన దేశం కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా వియాత్నం, ఘన వంటి దేశాల నుంచి జీడిపప్పును దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో తయారయ్యే జీడి పప్పు ఆ దేశానికి తప్పా మిగిలిన దేశాలకు ఎక్కువగా వెళ్తుంది. అయితే, ఒక ప్రాంతానికి చెందిన జీడి పప్పు మాత్రమే ఇతర దేశాలకు సరఫరా అవుతోంది. దీంతో మన రాష్ట్రంతో పాటు ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పండించే జీడిపప్పుకు అంతగా గిరాకీ ఉండడం లేదు. అయితే, వారం రోజుల కిందట భారత్‌పై విధించే సుంకాలను అమెరికా 18 శాతానికి పరిమితం చేసింది. దానికి అనుగుణంగా మన దేశం కూడా సుంకాలు ఎత్తివేయడంతో ఆ ప్రభావం పలాస జీడిపై కనిపిస్తోంది. ప్రధానంగా ఎర్రజొన్నలు, బాదం, జీడిపప్పు, సోయాబీన్‌ నూనె, వాల్‌నట్స్‌, పిస్తా, కొన్నిరకాల పండ్లపై భారత్‌ సుంకాలు తగ్గించింది. దీంతో అమెరికాకు కూడా మన జీడి పప్పు వెళ్లడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం మన జీడి పప్పు ఐదు శాతమే అమెరికాకు ఎగుమతి జరుగుతుండగా, సుంకాలు తగ్గిన నేపథ్యంలో రానున్న కాలంలో జీడి ఎగుమతులు 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మకాలు జోరందుకోగా పప్పు ధర కిలోకు రూ.50 అదనంగా పెరగడం విశేషం.

జిల్లాలో ప్రస్తుతం ఉద్దానంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో 27 వేల హెక్టార్లలో జీడి పంట సాగవుతోంది. జిల్లాలో మొత్తం 400 వరకూ జీడి పరిశ్రమలు ఉండగా ఒక్క పలాస-కాశీబుగ్గలోనే 250 పరిశ్రమల వరకూ ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ జీడి సీజను. పంట పండడం, పిక్కలు రైతులు సేకరించడం, వాటిని ఎండలో ఆరబెట్టడం, తరువాత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా అమ్మకాలు చేయడం జరుగుతుంది. సగటున ఎకరానికి నాలుగు బస్తాల జీడిపప్పు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పలాస-కాశీబుగ్గ జీడిమార్కెట్‌లో జీడిపప్పు ధరలు ఊపందుకున్నాయి. ప్రథమశ్రేణి జీడిపప్పు ధర కిలో రూ.900 పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే అన్ని రకాల జీడిపప్పులపై కిలోకు రూ.50 పెరగడంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అదనంగా ధరలు పెరిగే అవకాశాలు ఉండడం, జీడి పంట కూడా ఆశించినంతగా ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగుమతులపై ఆంక్షలు సడలించిన వేళ పూర్తిస్థాయిలో ఎగుమతులు జరిగితే పలాస జీడికి పంట పండినట్లే.

ప్రభుత్వ ప్రోత్సాహం

ప్రభుత్వం జీడి, కొబ్బరిని అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. దీనికి తోడు సుంకాలు ఎత్తివేయడానికి నిర్ణయించడం వల్ల మన జీడి ఉత్పత్తి, పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాయి. ప్రస్తుతం కేవలం ఐదు శాతం జీడి ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ నుంచి రవాణా జరుగుతుంది. రవాణా పెరిగితే పూర్తిస్థాయిలో జీడి పరిశ్రమ వృద్ధి చెందడానికి అవకాశం ఉంది.

-మల్లా శ్రీనివాస్‌, జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, పలాస

Updated Date - Feb 19 , 2026 | 11:26 PM