Share News

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:47 PM

Degree admission registrations begin today డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఎం వంటి కోర్సులో ప్రవేశానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టనుంది.

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

  • నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

  • బీఆర్‌ఏయూ పరిధిలో 88 కళాశాలలు

  • 18వేల సీట్ల భర్తీకి సన్నాహాలు

  • ఎచ్చెర్ల రూరల్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఎం వంటి కోర్సులో ప్రవేశానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టనుంది. 15 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు, 20లోపు సర్టిఫికెట్ల పరిశీలన, 20న వెబ్‌ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించింది. 26న సీట్లు కేటాయిస్తారు. 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎక్కువగా ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిని విద్యార్థులు.. డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్‌, బీఎస్సీ సీబీజెడ్‌ వంటి గ్రూపులకు ప్రాధాన్యమిస్తారు. దీంతోపాటు హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ విద్యార్థులు కామర్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులను ఎంపిక చేసుకుంటారు. హెచ్‌ఈపీ, బీకాం జనరల్‌, ఒకేషనల్‌ వంటివాటిపై కొంతమంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు.

  • 88 కళాశాలలు.. 18వేల సీట్లు

  • ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో 15 ప్రభుత్వ, 73 ప్రవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్‌, క్లాస్‌వర్కు, పరీక్షలు నిర్వహణ, ఫలితాలు విడుదల స్వాతంత్య్రంగా చేసుకుంటోంది. మిగతా 14 కళాశాలలు విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉంటాయి. ప్రైవేట్‌ కాలేజ్‌లు బీఆర్‌ఏయూ పర్యవేక్షణలో కొనసాగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అన్ని కోర్సుల్లో 18వేల వరకు సీట్లు ఉన్నాయి. గతేడాది పదివేల మంది వరకూ విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది సుమారు 11వేల మంది వరకూ విద్యార్థులు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు డిమాండ్‌ ఉంది. బారువా, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ, టెక్కలి కళాశాలల్లో కూడా సీట్లకు డిమాండ్‌ ఉంది. ఇంటర్మీడియట్‌లో ఎక్కువగా మార్కులు వచ్చినవారు శ్రీకాకుళంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో ప్రవేశాలకు ప్రాధాన్యమిస్తారు. కొన్ని కళాశాలల్లో డిగ్రీతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు సైతం శిక్షణ ఇస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ప్రవేశాలు లభిస్తాయి.

  • మార్గదర్శికాలకు అనుగుణంగా

  • ఉన్నత విద్యాశాఖ మార్గదర్శికాలకు అనుగుణంగా కౌన్సెలింగ్‌ ఉంటుంది. షెడ్యూల్‌ మేరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌, ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఇంటర్మీడియట్‌ మార్కులు, రూలాఫ్‌ రిజర్వేషన్‌ మేరకు సీట్లు కేటాయిస్తాం. విద్యార్థులు నచ్చిన కళాశాల, గ్రూప్‌ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అర్హులందరికీ ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది.

    - డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌, కళాశాల డెవలప్‌మెంట్‌ కౌన్సెల్‌ డీన్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

Updated Date - Aug 04 , 2026 | 11:47 PM