Share News

గురుకులాల్లో ప్రవేశాలకు వేళాయే

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:05 AM

Entrance exams for fifth grade and intermediate బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాలలు నాణ్యమైన బోధనకు, అత్యుత్తమ శిక్షణకు, క్రమశిక్షణకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. రానున్న విద్యాసంవత్సరంలో (2026-27) ఐదో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

గురుకులాల్లో ప్రవేశాలకు వేళాయే
దుప్పలవలసలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/కళాశాల

  • ఐదో తరగతి, ఇంటర్‌లో సీట్ల భర్తీకి సన్నాహాలు

  • 6 నుంచి పదో తరగతి వరకు మిగులు సీట్లు కూడా..

  • మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు

  • ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

  • ఎచ్చెర్ల, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాలలు నాణ్యమైన బోధనకు, అత్యుత్తమ శిక్షణకు, క్రమశిక్షణకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. రానున్న విద్యాసంవత్సరంలో (2026-27) ఐదో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగులు సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

  • జిల్లాలో దుప్పలవలస, కొల్లివలస, కంచిలిలో బాలురు గురుకుల పాఠశాల/ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉన్నాయి. బాలికలకు సంబంధించి ఎచ్చెర్ల, పెద్దపాడు, నందిగాం, మందస, పాతపట్నం పాఠశాల/ కళాశాలలు ఉన్నాయి. నందిగాంలో ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉండగా, మిగిలిన అన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 చొప్పున సీట్లు ఉన్నాయి. తామరాపల్లిలో కేవలం ఇంటర్మీడియట్‌ తరగతులను మాత్రమే నిర్వహిస్తారు. అలాగే ఒక్కో పాఠశాలలో ఐదో తరగతిలో 80 సీట్లు చొప్పున ఉన్నాయి.

  • ప్రవేశ పరీక్షలు ఇలా..

  • జిల్లాలోని ప్రతి గురుకుల పాఠశాల/ కళాశాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మార్చి 1న ఉదయం 9.30 నుంచి 11 గంటలకు ఐదో తరగతిలో ప్రవేశానికి, అదేరోజు మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల మధ్య ఇంటర్‌లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ, నీట్‌లో శిక్షణ పొందేందుకు వీలుగా మార్చి 1న మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

  • విద్యార్థులు దరఖాస్తులో ఇచ్చిన ఆప్షన్‌, ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్లను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాల లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్‌ ప్రఽథమ సంవత్సరంలో సీటు ఇస్తారు. ఇంటర్‌లో చేరేందుకు 31-8-2026 నాటికి 17 ఏళ్లు మించరాదు. అలాగే ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్నవారు మాత్రమే అర్హులు.

  • ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1-9-2013 నుంచి 31-8-2017 సంవత్సరాల మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓసీ, బీసీ, కన్వర్టర్డ్‌ క్రిస్టియన్‌ పిల్లలు 1-9-2015 నుంచి 31-8-2017 లోగా జన్మించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.

  • అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో 6,7 తరగతుల్లో ఖాళీల భర్తీకి వచ్చే నెల 2న ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 8,9,10 తరగతుల్లో సీట్ల భర్తీకి అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

  • ప్రత్యేకతలు ఎన్నో

  • సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీటు సాధిస్తే ఎన్నో ప్రత్యేకతలతో విద్యను అభ్యసించవచ్చు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, నాణ్యమైన శిక్షణతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తారు. సంస్కృతి, నైతిక విలువలు పెంపొందించేలా తర్ఫీదునిస్తారు. వ్యక్తిత్వ వికాసం, క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థుల్లో నూతనోత్తేజం, పర్యావరణం పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామంలో శిక్షణ ఇస్తారు. విద్యార్థుల్లో ఆత్మస్ధైర్యం కలిగేలా కరాటే శిక్షణ, వ్యాసరచన, వకృత్త్వం, క్విజ్‌, గీతాలాపన, చిత్రలేఖనం, సాంఘిక నాటకాలు, శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అఽధునాతన శాస్త్ర సాంకేతిక పరిశోధనల దిశగా ప్రోత్సాహిస్తారు. ఇంటర్మీడియట్‌తోనే సరిపెట్టకుండా నీట్‌, జేఈఈ, ఏపీఈఏపీ సెట్‌లకు నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ, నవీన సాంకేతికతను వినియోగించి డిజిటల్‌ బోధన, వర్చువల్‌ క్లాస్‌రూమ్స్‌, కంప్యూటర్‌ బోధన ఇస్తారు. ఐదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే మెరుగైన బోధన అందిస్తారు. ఉచిత భోజన, వసతి కల్పిస్తారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. వ్యాయామానికి అవసరమైన ట్రాక్‌సూట్‌, బూట్లు, ఉచితంగా ట్రంకు పెట్టె, స్టీలుప్లేటు, గ్లాసు, బెడ్డింగ్‌, పాదరక్షలు, కాస్మెటిక్స్‌ అందజేస్తారు.

  • సద్వినియోగం చేసుకోవాలి

  • గురుకుల పాఠశాల/కళాశాలల్లో నాణ్యమైన బోధన, అత్యుత్తమ శిక్షణ ఉంటుంది. ఈ కళాశాలల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడ్డారు. నైతిక విలువలు, సంప్రదాయాలపై తర్ఫీదు ఉంటుంది. సంస్కృతి, క్రీడలకు కూడా ప్రాధాన్యమిస్తాం. ఏటా శతశాతం ఫలితాలను సాధించేందుకు విద్యార్థులను ప్రణాళికాబద్ధంగా చదివిస్తాం. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

    - బోర బుచ్చిరాజు ప్రిన్సిపాల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/కళాశాల, దుప్పలవలస

Updated Date - Feb 17 , 2026 | 12:05 AM