Share News

లైఫ్‌జాకెట్‌ ధరిస్తే సేఫ్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:14 AM

Accidents with traditional boats జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న మత్య్యకారులకు చేపల వేటే జీవనాధారం. చేపల వేటకు వెళ్లిన సందర్భంలో మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

లైఫ్‌జాకెట్‌ ధరిస్తే సేఫ్‌
సంప్రదాయ తెప్పపై చేపలు వేటాడుతున్న మత్స్యకారులు

  • సంప్రదాయ బోట్లతోనే ప్రమాదాలు

  • ఈనెలలో నలుగురు మత్స్యకారుల మృతి

  • మూడేళ్లలో 31 మంది మృత్యువాత

  • ఛిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు

  • ఎచ్చెర్ల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న మత్య్యకారులకు చేపల వేటే జీవనాధారం. చేపల వేటకు వెళ్లిన సందర్భంలో మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు మృత్యువాతన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మృతదేహాలు కూడా కనిపించని పరిస్థితి. ఈ ప్రమాదాలతో మృత్యకారుల కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.

  • ఈ నెలలోనే నలుగురు మృత్యువాత

  • ఈ నెల 11న సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ చినదిబ్బల మరువాడకు చెందిన బైపల్లి రామారావు (65) చేపల వేటకు వెళ్లి బోటు బోల్తాపడడంతో మృతిచెందాడు. అదే రోజు వజ్రపుకొత్తూరు మండలం నువ్వలదేవు సముద్రతీరంలో బెహర భీమ (61) మృత్యువాతపడ్డాడు. ఇదే మండలం దేవునల్తాడకు చెందిన చెక్క గోపాలరావు (46) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. ఇదే నెలలో రణస్థలం మండలానికి చెందిన మత్స్యకారుడు చేపల వేట సాగించే క్రమంలో బోటు ప్రమాదానికి గురూ ప్రాణాలు కోల్పోయాడు.

  • సంప్రదాయ తెప్పలతోనే ప్రమాదం

  • సంప్రదాయ తెప్పలతో వేటకు వెళ్లడం వల్లే మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వృత్తి తెలియని వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. సాధారణంగా ఈ ప్రాంత మత్స్యకారులు తెరచాపలు (సంప్రదాయ తెప్పలు)తోనే సముద్రంపై వేట సాగిస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల గాలుల తీవ్రత, అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్ధితుల్లో తెప్పలు బోల్తా పడుతుంటాయి.

  • సూర్యోదయం కాకుండానే వేటకు..

  • వేసవికాలంలో ఉదయం 5 గంటలకే చేపల వేటకు వెళ్తుంటారు. అదే శీతాకాలంలో అయితే తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరుతారు. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉండడంతో మార్పులను గమనించకుండానే వేటకు వెళ్తుంటారు. చేపలు వేటాడిన తర్వాత తిరుగు ప్రయాణంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని తెప్పలు బోల్తాపడుతున్నాయి. సాధారణంగా తె ప్పలపై 6.40 నాటికల్‌ మైళ్లు (10 నుంచి 12 కిలో మీటర్లు) దూరం వరకు సముద్రంపైకి చేపల వేటకు వెళ్తుంటారు. ఒక తెప్పపై ఐదాగురు మత్స్యకారులు వేటసాగిస్తారు. సముద్రపు ఒడ్డు నుంచి 12 మీటర్ల దూరం వరకు అలలు తాకిడి ఉంటుంది. ఉదయం వేటకు బయలుదేరే సమయానికి వాతావరణం అనుకూలగా ఉన్నా, తిరిగొచ్చే సమయంలో మార్పుల వల్ల నీటి ప్రవాహ వేగం పెరిగి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. ఈ పరిస్ధితుల్లోనే మత్స్యకారులు చనిపోతున్నారు. తెప్ప బోల్తాపడడం వల్ల కొంతమంది తీవ్రంగా గాయపడుతున్నారు. ఇలాంటప్పుడు నీటి నుంచి పైకి లేవడానికి వీలుకాదు. అలాగే సముద్రంలోని మునిగిన తర్వాత నీరు తాగే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది.

  • తేలియాడే స్వభావంతో..

  • మర పడవలు, మోటారైజ్‌డ్‌ బోట్లతో చేపల వేట సాగించేవారు లైఫ్‌ జాకెట్లను ధరిస్తారు. పొరపాటున పడవ బోల్తాపడితే లైఫ్‌ జాకెట్‌ ధరించడం వల్ల తేలియాడే స్వభావం ఉండడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. సంప్రదాయ తెప్పలతో వేట సాగించేవారు లైఫ్‌ జాకెట్లు ధరించాలని తెలిసినా, మొండి ధైర్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. లైఫ్‌ జాకెట్లు కూడా పెద్దగా ఖరీదు కాదు. లైఫ్‌ జాకెట్లు ధరిస్తే వేటకు అనుకూలంగా ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు.

  • మూడేళ్లలో 31 మంది జాలర్లు మృతి

  • జిల్లాలో గడిచిన మూడేళ్లలో సముద్రంపైకి చేపలు వేటకు వెళ్లి 31 మంది మంది మృతి చెందినట్టు గుర్తించారు. వీరి కుటుంబాలకు మత్స్య, కార్మిక శాఖల తరపున రూ.5 లక్షల వంతున పరిహారం అందజేసేందుకు అధికారులు సిద్ధంచేశారు.

  • సబ్సిడీపై లైఫ్‌ జాకెట్లు:

  • సముద్రంపైకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లైఫ్‌ జాకెట్టు ధరిస్తే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చు. లైఫ్‌ జాకెట్లను సబ్సిడీపై అందజేస్తాం. లైఫ్‌ జాకెట్ల ధరించడం వల్ల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నాం. బోటుకు జీపీఎస్‌కు అనుసంధానం చేస్తూ ట్రాన్స్‌ ఫాండర్స్‌ను అమర్చడం వల్ల ఎక్కడ ఉన్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.

    - వై.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్‌, మత్స్యశాఖ

Updated Date - Jan 22 , 2026 | 12:14 AM