ఇంకా పూర్తికాలేదు సార్!
ABN , Publish Date - May 23 , 2026 | 11:48 PM
‘Mana Ooru- Matamanti’ completes one year in Ravivalasa టెక్కలి మండలం రావివలస గ్రామస్థులకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్.. ‘మన ఊరు.. మాటామంతి’ కింద ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా, ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతి’ అనే స్ర్కీన్‌గ్రీవెన్స్ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు.
రావివలసలో ‘మన ఊరు- మాటామంతి’కి ఏడాది పూర్తి
అప్పట్లో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు హామీ
రూ.3.78 కోట్లతో మాత్రమే పనులు పూర్తి
సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్థుల ఆవేదన
టెక్కలి, మే 23(ఆంధ్రజ్యోతి): టెక్కలి మండలం రావివలస గ్రామస్థులకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్.. ‘మన ఊరు.. మాటామంతి’ కింద ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా, ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతి’ అనే స్ర్కీన్‌గ్రీవెన్స్ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు. గతేడాది మే 22న టెక్కలిలోని ఓ థియేటర్ వేదికగా రావివలస గ్రామస్థులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి.. తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీచేశారు. ప్రజల అభ్యర్థన మేరకు రావివలసలో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.15కోట్లు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. అప్పటి సర్పంచ్ బాలకృష్ణ తీర్మానాలు సైతం అందజేశారు. కానీ ఈ ఏడాది వ్యవధిలో కనీసం 40 శాతం అభివృద్ధి పనులు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టి సారించి.. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అప్పట్లో విజ్ఞప్తులు ఇవీ..
రావివలస పెద్దచెరువుల పంట కాలువ ఆక్రమణలు తొలగించాలి. రావివలస, చిన్ననారాయణపురం, దామోదరపురం గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి. గ్రామంలో తాగునీరు ఇబ్బందులు లేకుండా ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించాలి. జగ్గరాసి చెరువువద్ద రజకుల కోసం దోబీఘాట్ ఏర్పాటు చేయాలి. రావివలస, దామో దరపురం గ్రామాల్లో శ్మశానవాటికలకు రహదారి సౌకర్యం కల్పించాలి. జడ్పీ హైస్కూల్‌కు ప్రహరీ నిర్మించాలి. పెద్దచెరువు, సీతకోనేరులకు మెట్లు సౌకర్యం కల్పించాలి. గ్రంధాలయం, బస్‌షెల్టర్, కళావేదిక, డ్వాక్రాభవనం నిర్మించాలి. ఎండల మల్లన్న ఆలయానికి రాకపోకలకు పూర్తిస్థాయి సీసీ రోడ్డు నిర్మించాలి. 2014-19 మధ్య ఇళ్ల కాలనీలు నిర్మించినవారికి నిధులు మంజూరు చేయాలి. చిన్నచిన్న పరిశ్రమలు నెలకొల్పాలని రావివలస గ్రామస్థులు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కార్యరూపం దాల్చినవి
ఎండల మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే రహదారి మార్గంలో రూ.2.25 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మరో రూ.1.75 కోట్లతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రావివలస జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ముందువైపు ప్రహరీ నిర్మించారు. వెనుక ప్రాంతంలో మాత్రం వదిలేశారు. పంచాయతీరాజ్ విభాగం నుంచి రూ.11.28 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఏడాదికి 20 పనులకు మాత్రమే అనుమతిచ్చారు. అందులో భాగంగా 11 పనులు రూ.3.78 కోట్లతో పూర్తయ్యాయి. ఇంకా రూ.2.31 కోట్లతో ఏడు పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.
పరిష్కారం కానివి..
అప్పట్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించాలని రావివలస గ్రామస్థులు కోరారు. దీనిపై ప్రస్తుత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏమంటున్నారంటే.. ‘పైప్‌లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నాం. టెక్కలి నియోజకవర్గానికి రూ.602 కోట్లతో వాటర్‌గ్రిడ్ మంజూరైంది. దీంతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు కాలేదు. గ్రిడ్ పనులకు మరో వారం పదిరోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంద’ని తెలిపారు.
రావివలస, దామోదరపురం గ్రామాల్లో శ్మశానవాటికలకు రహదారి సౌకర్యం కల్పించాలని అప్పట్లో ప్రజలు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇది అసలు కార్యరూపమే దాల్చలేదు.
జగ్గరాసి చెరువు వద్ద రజకుల కుటుంబాల కోసం దోబీఘాట్ నిర్మించాలని కోరగా.. అది కూడా నెరవేరలేదు.
రావివలసలో సీసీ రోడ్లు, కాలువలు పూర్తిస్థాయిలో నిర్మించ లేదు.
అధికారులు ఏమంటున్నారంటే..
‘ఎన్‌ఆర్‌ఈజీఎస్ విభాగానికి సంబంధించి రూ.6.09 కోట్లకుగానూ ఇప్పటికే రూ.3.78 కోట్ల వ్యయంతో పనులు పూర్తిచేశాం. రూ.2.38 కోట్లతో పనులు నిర్మాణ దశలో ఉన్నాయ’ని పంచాయతీరాజ్ డీఈఈ సుధాకర్ తెలిపారు. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ రామకృష్ణ వద్ద ప్రస్తావించగా.. ‘టెక్కలి నియోజకవర్గానికి వాటర్‌గ్రిడ్ పథకం మంజూరైంది. త్వరలో పిలిచి నిర్మాణ పనులు చేపడతామ’ని తెలిపారు.