ప్రభుత్వ జాగా.. ఆక్రమించేద్దాం
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:01 AM
మండల కేంద్రం మెళియాపుట్టిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
- మెళియాపుట్టిలో విలువైన భూముల కబ్జా
- 278 ఎకరాలపై ఆక్రమణదారుల కన్ను
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
మెళియాపుట్టి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం మెళియాపుట్టిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇటు మెళియాపుట్టి నుంచి అటు చాపర వరకూ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ విద్యా సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ పార్కులు) వస్తుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఆక్రమణదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొన్ని రోజుల పాటు షెడ్లు వేసి తరువాత ఆ స్థలాలను అమ్మకానికి పెడుతున్నారు. ఆక్రమణదారులకు కొందరు రాజకీయ నేతలు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ పరిస్థితి..
మెళియాపుట్టికి సమీపంలో సర్వే నెంబరు 486లో సుమారు 398 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 70 ఎకరాలను ఇటీవల ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కేటాయించింది. ఉద్దానం వాటర్ గ్రిడ్‌కు 10 ఎకరాలు, ఏకలవ్య పాఠశాలకు 15 ఎకరాలు, మోడల్ స్కూల్‌కు 5 ఎకరాలు, జగనన్న కాలనీకి సుమారు 15 ఎకరాలను గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. జిల్లా పరిషత్ పాఠశాలకు 5 ఎకరాల వరకు గత టీడీపీ ప్రభుత్వం అందించింది. ఈ ప్రాంతంలో సాయిబాబా గుడికి కూడా కొంత భూమిని అధికారులు కేటాయించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండడంతో మిగిలి ఉన్న 278 ఎకరాల భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. భూములను ఆక్రమించి తొలుత గడ్డి కుప్పలు వేస్తున్నారు. తరువాత షెడ్లను నిర్మిస్తున్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి పక్క పంచాయతీకి వెళ్లిన ఒక రెవెన్యూ అధికారి ఒక్కొక్కరి నుంచి రూ.30వేలు తీసుకొని ఆక్రమణదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఇళ్ల కోసం దరఖాస్తులు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీన్నిపై గ్రామానికి చెందిన కొంతమంది కలెక్టర్‌తో పాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించినా రెవెన్యూ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు మెళియాపుట్టి-టెక్కలికి వెళ్లే మార్గంలో ఉన్న ప్రభుత్వం స్థలం కూడా ఆక్రమణకు గురవుతోంది. దీనికి ఎదురుగా ఉన్న ప్రైవేట్ భూముల్లో వెంచర్లు వేయడంతో ఈ ప్రాంతంలో ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి కొందరు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
మెళియాపుట్టిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. నిర్మాణాలను తొలగిస్తాం. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తాం.
-బి.పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి