రెండేళ్లుగా చెల్లించట్లే!
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:01 AM
గ్రామ పంచాయతీలకు నిధుల గ్రహణం వెంటాడుతోంది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- పంచాయతీలకు అందని సర్ చార్జీలు
- రూ.60 కోట్ల వరకూ పెండింగ్
- సబ్ ట్రెజరీలో మూలుగుతున్న నిధులు
- అభివృద్ధి పనులకు ఇబ్బందులు
రణస్థలం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు నిధుల గ్రహణం వెంటాడుతోంది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి, ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఆశించినస్థాయిలో పురోగతి లేదు. పోనీ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి చెల్లించాల్సిన సర్ చార్జీల విషయంలో కూడా ఏళ్ల తరబడి పెండింగ్ కొనసాగుతోంది. వైసీపీ ఐదేళ్ల కాలంలో ఈ సర్ చార్జీలు అస్సలు విడుదల చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జూన్‌లో అప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న సర్ చార్జీలు విడుదలయ్యాయి. ఆ తరువాత ఇప్పటివరకూ రెండేళ్లకు సంబంధించి సర్‌చార్జీలు విడుదల కాకపోవడంతో పంచాయతీలపై భారం పడుతోంది. మేజర్ పంచాయతీలతో పాటు పెద్ద పంచాయతీలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటి కోసం పంచాయతీ అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 30 మండలాల్లో 912 పంచాయతీలు ఉన్నాయి. భూములు, భవనాలు, ఇళ్ల స్థలాల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. భూముల విలువను బట్టి చెల్లించే స్టాంప్ డ్యూటీలో 5 శాతం నగదు సర్ చార్జీల రూపంలో పంచాయతీలకు బదలాయించాలి. ఆయా నగదు ఎప్పటికప్పుడు ఆ మండలాల పరిధిలోని సబ్ ట్రెజరీలో జమ అవుతుంది. పంచాయతీలు దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో సబ్ ట్రెజరీ నుంచి సీఎంఎఫ్‌ఎస్ విధానం ద్వారా విడుదల చేయాలి. కానీ జూన్ 2024 నుంచి ఇప్పటివరకూ సర్ చార్జీల చెల్లింపులు జరగలేదు. జిల్లాలో ఈ లెక్కన రూ.60 కోట్ల వరకూ చెల్లింపులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. రణస్థలం, జేఆర్‌పురం, పైడిభీమవరం లాంటి పంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున రావాల్సి ఉంది. కానీ పంచాయతీల ఖాతాల్లో జమ కాకపోవడంతో పారిశుధ్యం, తాగునీరు వంటి చిన్నచిన్న పనులకు కూడా నిధుల కొరత వెంటాడుతోంది.
పవన్ చొరవతో..
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ సర్ చార్జీల చెల్లింపు అనేది పూర్తిగా నిలిచిపోయింది. ఈ సర్‌చార్జీలను సబ్ ట్రెజరీల నుంచి ప్రభుత్వమే లాక్కునేది. వాస్తవానికి సర్‌చార్జీ అనేది రాజ్యాంగబద్ధ చెల్లింపు. కానీ, వైసీపీ మాత్రం సంక్షేమ పథకాల పేరుతో నిధులను మళ్లించింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో 2024 జూన్‌లో నిధుల విడుదలకు మోక్షం కలిగింది. కానీ గత రెండేళ్లుగా సర్‌చార్జీల చెల్లింపు నిలిచిపోవడంతో పంచాయతీలో పారిశుధ్య పనులు, తాగునీటి కల్పన వంటి సమస్యలు కూడా తీరడం లేదు. మరోవైపు వర్షాకాలం సమీపించింది. దీంతో నిధులు లేక పంచాయతీలు ఇబ్బందిపడుతున్నాయి. వాస్తవానికి కూటమి వచ్చిన తరువాత నేరుగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల అవుతున్నాయి. అదే మాదిరిగా సర్ చార్జీల చెల్లింపులు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఈ విషయంలో మంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతున్నారు.
పెండింగ్ వాస్తవమే..
గత రెండేళ్లుగా సర్ చార్జీల చెల్లింపు జరగడం లేదు. రణస్థలం పంచాయతీకి సర్ చార్జీల రూపంలో రూ.25 లక్షల వరకూ రావాలి. ఇవి వస్తే పారిశుధ్యం, తాగునీరు, వీధి ధీపాల ఏర్పాటు వంటి వాటికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ నిధులు దోహదపడతాయి.
-ఎం.ఈశ్వరరావు, ఎంపీడీవో, రణస్థలం