Share News

నాలుగేళ్లవుతున్నా..!

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:06 AM

The Palasa RDO office does not have its own building పేరుకే రెవెన్యూ డివిజన్‌ కానీ.. పలాసలో ఆర్డీవో కార్యాలయానికి ఇంతవరకూ సొంత భవనం లేదు. నాలుగేళ్ల కిందట కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం పలాస డివిజన్‌ను ఏర్పాటుచేసింది. అప్పట్లో ఎంతో ఆర్భాటం చేసింది. కానీ సొంత భవనం సమకూర్చడం, సిబ్బందిని భర్తీ చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టలేదు.

నాలుగేళ్లవుతున్నా..!
పలాస ఆర్డీవో కార్యాలయం

పలాస ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనం లేదు

అధికారులు, సిబ్బంది అంతంతమాత్రమే

ఏడు మండలాల ప్రజలకు తప్పని ఇబ్బంది

కాశీబుగ్గ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): పేరుకే రెవెన్యూ డివిజన్‌ కానీ.. పలాసలో ఆర్డీవో కార్యాలయానికి ఇంతవరకూ సొంత భవనం లేదు. నాలుగేళ్ల కిందట కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం పలాస డివిజన్‌ను ఏర్పాటుచేసింది. అప్పట్లో ఎంతో ఆర్భాటం చేసింది. కానీ సొంత భవనం సమకూర్చడం, సిబ్బందిని భర్తీ చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సొంతగూడు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం లేదు. దీంతో అధికారులు, సిబ్బందికి, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

వైసీపీ హయాంలో..

వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో కొత్త జిల్లాల విభజన చేపట్టింది. అప్పట్లో పాలకొండ రెవెన్యూ డివిజన్‌ పార్వతీపురం మన్యం జిల్లాలో కలపడంతో పలాస రెవెన్యూ డివిజన్‌ తెరపైకి వచ్చింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, నందిగాం మండలాలతోపాటు పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీని కలుపుతూ పలాస రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. డ్వామా కార్యాలయ భవనంలో నూతన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ ఇంతవరకూ సొంత భవనం ఏర్పాటు చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కాశీబుగ్గ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ప్రాంగణాన్ని జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించింది. అక్కడ ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేశారు. కానీ తరువాత ఎందుకో ఆ ప్రయత్నం బుట్టదాఖలైంది.

వసతులు దారుణం..

తాత్కాలిక ఆర్డీవో కార్యాలయంలో వసతులు అంతంతమాత్రమే. మరుగుదొడ్లు లేవు. తాగునీటి సదుపాయం కూడా సరిగ్గాలేదు. దీంతో కార్యాలయానికి వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలు నిలిపేందుకు, ప్రజలు నిరీక్షించేందుకు కనీసం ఆరుబయట షెడ్లు కూడా లేవు. సిబ్బంది కొరత కూడా ఉంది. ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసిన చాలారోజుల తరువాత ఇక్కడ ఆర్డీవోను నియమించారు. డీఏవో, డీఐవో, ఈడీఎం, డీఎస్‌డీవో పోస్టులు ఇంకా పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల కొరత కూడా ఉంది. టెక్కలి డివిజన్‌ నుంచి పలాస రెవెన్యూ డివిజన్‌గా మారడంతో ఏడు మండలాలకు సంబంధించి ఫైళ్లను తాత్కాలిక కార్యాలయానికి తరలించారు. కానీ వాటికి కార్యాలయంలో రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనంతో పాటు సిబ్బంది, అధికారులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

ఇబ్బందులు లేకుండా..

ఆర్డీవో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. ప్రస్తుతం రెండు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నాం. కొత్త కార్యాలయ భవనం నిర్మాణం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంది. నిధులు మంజూరైన వెంటనే కార్యాలయం పనులు చేపడతాం.

- వెంకటేష్‌, ఆర్డీవో, పలాస

Updated Date - Jan 09 , 2026 | 12:06 AM