వారమైంది.. నీరురాక!
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:04 AM
Non-functional taps ఆరు నెలలుగా రక్షితనీటి పథకం కుళాయిల నుంచి సక్రమంగా నీరు రావడంలేదు. వారం రోజులుగా పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు, నాయకుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇక ఊరుకునేది లేదంటూ మహిళలు, స్థానికులు ధర్నాకు దిగారు.
సక్రమంగా పనిచేయని కుళాయిలు
హిరమండలంలో మహిళల ఆందోళన
అలికాం-బత్తిలి రహదారిపై రెండు గంటలపాటు నిలిచిన వాహనాలు
హిరమండలం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ఆరు నెలలుగా రక్షితనీటి పథకం కుళాయిల నుంచి సక్రమంగా నీరు రావడంలేదు. వారం రోజులుగా పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు, నాయకుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇక ఊరుకునేది లేదంటూ మహిళలు, స్థానికులు ధర్నాకు దిగారు.
హిరమండలం మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్యపై మహిళలు, స్థానికులు ఆందోళన చేపట్టారు. గురువారం అలికాం- బత్తిలి రహదారిపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ‘ఆరు నెలలుగా కుళాయిల నుంచి పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. వారం రోజుల నుంచి నీటి సమస్య మరింత ఎక్కువైంది. బిందెడు నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదికి వెళ్లాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లలేక కొంతమంది బావులు, బోర్లు మీదే ఆధారపడుతున్నాం. తాగునీటి సమస్య పరిష్కరించాల’ని డిమాండ్ చేశారు. గ్రామం చుట్టూ నీరు ఉన్నా.. తాగడానికి చుక్కనీరు ఇవ్వలేకపోతున్నారని అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిరమండలం మేజర్ పంచాయతీ ప్రత్యేకాధికారిగా ఉన్న తహసీల్దార్ బాలకృష్ణ వచ్చి తాగునీటి సమస్య పరిష్కారానికి స్పష్షమైన హామీ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని.. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తహసీల్దార్ వచ్చేవరకూ కదిలేది లేదని తేల్చిచెప్పారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు రెండు గంటలపాటు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకటేష్ వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘రహదారిని దిగ్భందించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగిండంతోపాటు సెక్షన్ 30పోలీస్ యాక్టు ధిక్కరించినందుకు వారిపై కేసు నమోదు చేశామ’ని సీఐ ప్రసాదరావు తెలిపారు. సెక్షన్ 30 యాక్టు అమలులో ఉన్నందున పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజాశాంతికి భంగం కలిగే ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.