Share News

13 ఏళ్లుగా ప్రతిపాదనలే..

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:50 PM

Vamsadhara canal works as a dream వంశధార ప్రధాన ఎడమకాలువ దశాబ్దాలుగా ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. ఇందుకు సంబంధించి రూ.1,400కోట్లతో జలవనరుల శాఖకు చేసిన ప్రతిపాదన.. కొర్రీలతోనే నిలిచిపోయింది.

13 ఏళ్లుగా ప్రతిపాదనలే..
టెక్కలి సమీపాన వంశధార ప్రధాన ఎడమ కాలువ ఇలా..

కలగానే వంశధార ప్రధాన ఎడమకాలువ ఆధునికీకరణ

రెట్టింపైన అంచనా వ్యయం

సాగునీరు అందక రైతులకు ఇక్కట్లు

టెక్కలి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రధాన ఎడమకాలువ దశాబ్దాలుగా ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. ఇందుకు సంబంధించి రూ.1,400కోట్లతో జలవనరుల శాఖకు చేసిన ప్రతిపాదన.. కొర్రీలతోనే నిలిచిపోయింది. మొదట్లో వంశధార ప్రధాన ఎడమకాలువ ఆధునికీకరణకు రూ.700కోట్లతో ప్రతిపాదన చేయగా.. ప్రస్తుతం అంచనా విలువ రెట్టింపు అయింది. ఇప్పటికే జలవనరులశాఖ కొర్రీలమీద కొర్రీలు వేస్తూ ఈ ఫైల్‌ను ఆరు సార్లు వెనక్కి పంపింది. కాలువ పనులు చేపట్టేందుకు మార్చి నుంచి జూన్‌ వరకు అనుకూలమైన కాలం. కాగా ఈ ఏడాది కూడా నిధులు మంజూరు లేక కాలువ ఆధునికీకరణ కలగానే మిగిలిపోయింది.

వంశధార ప్రధాన ఎడమకాలువ కింద హిరమండలం, సారవకోట, జలుమూరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస తదితర మండలాలకు సంబంధించి ఇప్పటికే సుమారు 1.51 లక్షల ఎకరాలకు ఎడమకాలువ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. 26 ఎత్తిపోతల పథకాల కింద కూడా 29,247 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కాగా ఇంత ప్రాధాన్యత గల వంశధార ప్రధాన ఎడమకాలువ 2013నుంచి ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రభుత్వాలు మారుతున్నా.. ఆధునికీకరణకు మాత్రం నిధులు మంజూరు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 1977లో రాతికట్టడాలతో ఈ కాలువ నిర్మాణ పనులు చేయగా.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పూడికలు తొలగించడం, వంశధార కాలువ వెంబడి నీరు వదిలే సమయంలో కేటగిరీ-ఏ పనులు తప్ప మరే పనులు జరగడం లేదు. దీంతో శివారు ప్రాంతాలకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. కాలువ గట్లు, లైనింగ్‌ పనులు, స్ట్రక్చర్ల నిర్మాణం, వంతెనలు, షట్టర్లు, సూపర్‌పాసేజ్‌లు, అండర్‌ టన్నల్స్‌, యాక్యురేట్లు, డిస్టిబ్యూటరీ కాలువలు ఇలా అనేక పనులు చేపడితే తప్ప కాలువల వెంబడి పూర్తిస్థాయి సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. 2,480 క్యూసెక్కులతో డిజైన్‌ చేసిన ఈ కాలువ పరిస్థితి.. టెక్కలి సమీపంలో మదనగోపాలసాగరం జలాశయానికి 550 క్యూసెక్కుల సాగునీరు రావడమే గగనమవుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వంశధార కాలువ ఆధునికీకరణ పనులకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఈ విషయమై ఈఈ బి.శేఖరరావు వద్ద ప్రస్తావించగా.. ‘వంశధార కాలువ ఆధునికీకరణకు సంబంధించి జలవనరుల శాఖ వద్ద రూ.1,400కోట్లతో ప్రతిపాదనలో ఉంది. తాత్కాలికంగా శివారు ప్రాంతమైన కిడిసింగి వరకు సాగునీరు వచ్చేందుకు రూ.25కోట్లతో ప్రతిపాదనలు చేశామ’ని తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 11:50 PM