Share News

మిమ్మల్ని చూసి 30 ఏళ్లయింది

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:20 AM

Former Maoist returns to his village ‘గ్రామంలో అంతా బాగున్నారా... మీ అందరినీ చూసి 30 ఏళ్లవుతుంది. ఇకపై అంతా కలసికట్టుగా.. సంతోషంగా ఉందాం’ అని మాజీ మావోయిస్టు చెల్లూరి నారాయణరావు బాతుపురం గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.

మిమ్మల్ని చూసి 30 ఏళ్లయింది
నారాయణరావుకు స్వాగతం పలికిన సోదరుడు సింహాచలం, కుటుంబ సభ్యులు

చెల్లూరి నారాయణరావు ఆత్మీయ పలుకరింపు

స్వగ్రామానికి చేరిన మాజీ మావోయిస్టు

గ్రామస్థులు, కుటుంబీకుల యోగక్షేమాలపై ఆరా

పలాస/వజ్రపుకొత్తూరు/కాశీబుగ్గ, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘గ్రామంలో అంతా బాగున్నారా... మీ అందరినీ చూసి 30 ఏళ్లవుతుంది. ఇకపై అంతా కలసికట్టుగా.. సంతోషంగా ఉందాం’ అని మాజీ మావోయిస్టు చెల్లూరి నారాయణరావు బాతుపురం గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. మావోయిస్టు ఉద్యమంలో వజ్రపుకొత్తూరు మండలం బాతుపురానికి చెందిన టెక్‌శంకర్‌, నారాయణరావు ఉండేవారు. కేంద్రప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడంతో శంకర్‌ కొద్ది నెలల కిందట పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ఇక మిగిలింది నారాయణరావు ఒక్కరే. ఈయన కూడా సజీవంగా గ్రామంలోకి వస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ నారాయణరావు గత నెల 30న విజయవాడలో పోలీసుల సమక్షంలో తన అనుచరులతో జనజీవన స్రవంతిలో కలిశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాగతించిన విషయం విధితమే. కమాండెంట్‌ స్థాయికి ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని గ్రామస్థులు కూడా స్వాగతించారు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తొలిసారిగా ఆయన శనివారం సాయంత్రం స్వగ్రామమైన బాతుపురానికి చేరుకున్నారు. ఆయనకు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఘన స్వాగతం పలికారు. ఇంటి బయటే కూర్చొని వారందరినీ నారాయణరావు ఆత్మీయంగా పలుకరించారు. పాత జ్ఞాపకాలు, అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. సోదరుడు చెల్లూరు సింహాచలం ఎప్పుడో ఇళ్లు విడిచిన నారాయణరావును చూసి కన్నీటిపర్యంతమయ్యారు. మొత్తం కుటుంబ సభ్యులంతా ఒకేసారి కలుసుకోవడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా.. విలేకరులతో నారాయణరావు మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత బాతుపురంలోకి అడుగుపెట్టి.. అనేక మందిని కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. .

Updated Date - Apr 12 , 2026 | 12:20 AM