Share News

సందడే సందడి

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:08 AM

సంక్రాంతి వచ్చింది.. సందడి తెచ్చింది.. పల్లె, పట్టణాలు కొంగొత్త శోభను సంతరించుకున్నాయి.

సందడే సందడి
శ్రీకాకుళంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగిమంట వేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

- జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి

- ఆలయాల్లో గోదాదేవి కల్యాణం

- నేడు మకర సంక్రాంతి

శ్రీకాకుళం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వచ్చింది.. సందడి తెచ్చింది.. పల్లె, పట్టణాలు కొంగొత్త శోభను సంతరించుకున్నాయి. జిల్లా ప్రజలు బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రతిఒక్కరూ తలస్నాన మాచరించి భోగి మంట వేశారు. ముందుగా తయారుచేసిన పిడకలను భోగి మంటల్లో వేశారు. సాయంత్రం చిన్నారుల తలపై తల్లిదండ్రులు భోగి పండ్లు పోసి బాలరిష్టాలు పోయి ఆరోగ్యంగా ఉండాలని దీవించారు. రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆలయాల్లో గోదాదేవి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు. కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళంలోని తన స్వగృ హంలో కుటుంబంతో సహా భోగి జరుపుకొన్నారు. మకర సంక్రాంతిని గురువారం వైభవంగా జరుపుకొనేందుకు అంతా సిద్ధమయ్యారు. పండుగకు కావాల్సిన పిండివంటల సామగ్రి, పూజా సామాన్ల కొనుగోలుతో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. వస్త్ర, నగల దుకాణాలు కిక్కిరిసిపోయాయి. గురువారం ఉదయం పెద్దలను పూజించి మొక్కులు తీర్చుకోనున్నారు.

సంక్రాంతి సంబరాల్లో మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళిలో మంగళవారం కూటమి నేతలు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. భోగి మంటతో ఆరంభమైన వేడుకలు రంగవల్లులు, ఆటలపోటీలతో సందడిగా మారాయి. చిన్నారుల భరత నాట్యం చూపర్లను ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతిని చాటిచెబుతూ, రైతులకు మేలు చేకూరాలని ప్రార్థిస్తూ పుష్యలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలకు నిలయంగా నవ్యాంధ్ర విరిసిల్లాలని మంత్రి అచ్చెన్న ఆకాంక్షించారు. సంప్రదాయం, సంస్కృతికి నిలయం సంక్రాంతి అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషు, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 12:08 AM