Share News

నాలుగు నెలల్లో మొదలు కావాల్సిందే

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:56 PM

Works using MPLADS funds must be expedited అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. ఎంపీలాడ్స్‌ నిధులు మంజూరైన నాలుగు నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే.. వాటిని ఇతర అత్యవసర పనులకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు.

నాలుగు నెలల్లో మొదలు కావాల్సిందే
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. చిత్రంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఎమ్మెల్యే శంకర్‌

  • ఎంపీలాడ్స్‌ నిధులతో పనులు వేగవంతం చేయాలి

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అల్టిమేటం

  • అభివృద్ధి పనులో తీవ్ర జాప్యంపై ఆగ్రహం

  • సౌర విద్యుత్‌ పథకాల అమలుపై అసంతృప్తి

  • శ్రీకాకుళం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. ఎంపీలాడ్స్‌ నిధులు మంజూరైన నాలుగు నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే.. వాటిని ఇతర అత్యవసర పనులకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు కాలపరిమితిలోపు పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జల జీవన్‌ మిషన్‌ పురోగతిపై రెండు వారాలకొకసారి స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం అందిస్తూ పనుల్లో వేగం పెంచాలిన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎంపీలాడ్స్‌ కింద రూ. 24.35 కోట్లు విడుదల కాగా, రూ. 21.08 కోట్ల విలువైన పనులను తాను సిఫార్సు చేసినట్లు తెలిపారు. మరో రూ. 3.26 కోట్లతో నూతన పనుల సిఫార్సుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

  • సోలార్‌ పథకాల అమలుపై అసంతృప్తి..

  • జిల్లాలో పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ తదితర సౌర విద్యుత్‌ పథకాల అమలులో ఆశించిన ప్రగతి లేకపోవడంపై కేంద్రమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 19 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 56,000 ఇళ్లకు సౌర విద్యుత్‌ అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే టెండర్ల ఖరారు, పాత ట్రాన్స్‌ఫార్మర్లు, దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాల అప్‌గ్రేడేషన్‌ వంటి విషయాల్లో సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలకే పరిమితం కాకుండా ఏ పనిని, ఎప్పటిలోగా పూర్తి చేయాలో కార్యాచరణ రూపొందించాలన్నారు.

  • పారిశ్రామికవేత్తల తయారీకి రూ.100 కోట్లు

  • జిల్లాలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ. 100 కోట్లతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. సెప్టెంబరు మూడో వారంలో ప్రారంభమయ్యే ‘వందమంది యువ పారిశ్రామికవేత్తలు’ కార్యక్రమం ద్వారా 2500 మందికి పైగా ఉపాధి లభించనుందన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ కంపెనీల సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంక్‌ రుణాలు సమన్వయం చేసుకుని ఔత్సాహికులకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిధులతో చేపట్టిన గూణపాలెం, హడ్కోకాలనీ, ఆర్కేనగర్‌ పార్క్‌లతో పాటు ఆమదాలవలస, మందస, ఇచ్ఛాపురం, పాతపట్నంలో నిర్మిస్తున్న ఇండోర్‌ స్టేడియంలు, జిల్లా కేంద్ర లైబ్రరీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అరసవల్లి పుష్కరిణి పనులను నవంబరు నాటికి, కోడి రామ్మూర్తి స్టేడియం ఫేజ్‌-1 పనులను డిసెంబరు 31 నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు. మూలపేట పోర్టు, నాగావళి రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌, పలాస ఆర్వోబీ, శ్రీకూర్మం ఆలయ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, సీతంపేట ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, సీపీఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:56 PM