Share News

సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:21 PM

‘గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. భూగర్భజలాలను పెంపొందించడం, పరిసరాలు పరిశుభ్రత మీపైన ఉంది.’ అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే
గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

- ఎమ్మెల్యే రమణమూర్తి

జలుమూరు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) ‘గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. భూగర్భజలాలను పెంపొందించడం, పరిసరాలు పరిశుభ్రత మీపైన ఉంది.’ అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నగిరికటకం గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం, ఇంకుడు గుంతలు తవ్వడాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. గత ప్రభుత్వ పాలనలో మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళ తీసి అప్పుల ఆంధ్రాగా, రాజధాని లేని రాష్ట్రంగా చేశారన్నారు. ప్రజలు గమనించి గత ఎన్నికల్లో సమర్థవంతమైన పాలన అందించే నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అధికారంలోకి తెచ్చారన్నారు. ప్రధానమంత్రి మోదీ, అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖమంత్రి లోకేష్‌ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి నడుం బిగించారన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.చిన్నమ్మడు, పంచాయతీ ప్రత్యేకాధికారి ఎం.దీప్తి, టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, టీడీపీ నాయకులు పంచిరెడ్డి రామచంద్రరావు, భేరి ప్రసాదరావు, అసిరినాయుడు, పోలాకి సొసైటీ అధ్యక్షుడు బైరి భాస్కరరావు, వీఆర్వో గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:21 PM