Share News

ముందే గుర్తిస్తే మేలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:44 PM

క్యాన్సర్‌ అనేది ఏ వయసువారికైనా రావొచ్చు. ఏ అవయవానికైనా సోకొచ్చు.

ముందే గుర్తిస్తే మేలు

-క్యాన్సర్‌ నుంచి బయటపడొచ్చు

- ప్రాథమిక స్థాయిలో చికిత్స అందిస్తే ప్రయోజనం

- జిల్లాలో స్ర్కీనింగ్‌ పరీక్షలు

-నేడు జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం

శ్రీకాకకుళం కల్చరల్‌, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ అనేది ఏ వయసువారికైనా రావొచ్చు. ఏ అవయవానికైనా సోకొచ్చు. ప్రపంచ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అవగాహన పెంచుతున్నా.. ప్రజల్లో నిర్లిప్తత, నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. క్యాన్సర్‌పై ప్రజల్లో చైతన్యం అంతంత మాత్రంగానే ఉంది. అవగాహన పెంపొందించుకొని ముందస్తుగా వ్యాధిని గుర్తించగలగడం, ప్రాథమిక స్థాయిలో చికిత్స అందించడం వలన క్యాన్సర్‌ నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుంటే క్యాన్సర్‌ నుంచి దూరమయ్యేందుకు చాన్స్‌ ఎక్కువగా ఉంది. నేడు జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

లక్షణాలు ఇవే..

శరీరంలో ఏర్పడే గడ్డలు, నోటిలో ఏర్పడే పుండ్లు రెండు వారాలకు మించి తగ్గకపోవడం, గొంతు బొంగురుపోవడం, కారణంలేకుండా బరువు తగ్గడం, మలం, మూత్రంలో రక్తం కనిపించడం, రొమ్ముల్లో గడ్డలు, చర్మంపైన మచ్చల్లో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

క్యాన్సర్‌ రకాలు..

సాధారణంగా మన దేశంలో ఓరల్‌, బ్రెస్ట్‌, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తులు, పెద్దపేగు, ప్రొస్టేట్‌ వంటి క్యాన్సర్‌ రకాలు ఉన్నాయి. క్యాన్సర్‌ రావడానికి ఇతిమిద్దంగా కారణమంటూ ఉండదు. వ్యక్తిగతమైన జీవనశైలి, వంశపారంపర్యం, పర్యావరణం, కొన్ని ఇన్‌పెక్షన్లు కారణమవుతుంటాయని రిమ్స్‌కు చెందిన మెడికల్‌ అంకాలజిస్ట్‌ రవీందర్‌ చెబుతున్నారు. పొగ తాగడం, గుట్కా, ఖైనీ, జర్దా, పొగాకు నమలడం, సిగరెటు, బీడీలు కాల్చడం, మద్యం సేవించడం, శారీరక వ్యాయామం లేకపోవడం, హెచ్‌పీవీ, హెపటైటిస్‌-బి,సి వంటి వైరల్‌ ఇన్‌పెక్షన్లకు గురవడం, కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర కలిగి ఉండడం వలన క్యాన్సర్‌కు గురయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అంటున్నారు.

ఈ పరీక్షల ద్వారా..

మమోగ్రఫీ ద్వారా రొమ్ములోని చిన్న మార్పులను గుర్తించవచ్చు. పాఫ్‌స్మియర్‌ ద్వారా గర్భాశయ ముఖద్వారంలోని అసాధారణ కణాలను గుర్తించొచ్చు. హెచ్‌పీవీ పరీక్ష ద్వారా ప్రమాదకర హెచ్‌పీవీ రకాల ఇన్‌పెక్షన్లను తెలుసుకోవచ్చు. అనుమానస్పద గడ్డ అయితే బయాప్సీ వలనే క్యాన్సర్‌ నిర్ధారణ జరుగుతుంది. ఏ పరీక్షైనా అనుమానం వచ్చిన వెంటనే చేయించుకోవడం ముఖ్యం. దీనివలన తొలిదశలోనే క్యాన్సర్‌ నివారణకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఆరోగ్యకర జీవనశైలి..

ఆరోగ్యకర అలవాట్లు, జీవనశైలి క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంటుంది. అధికంగా ప్రాసెస్‌ చేసిన మాంసాహారానికి దూరంగా ఉండడం, ఉప్పు, కొవ్వు తగ్గించడం, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలకు భోజనంలో ప్రాధాన్యత కల్పించడం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి. రోజుకు ఎనిమిది గంటల నిద్రపోవాలి.

బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను 99 శాతం అడ్డుకొనే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ హెచ్‌పీవీ టీకా పంపిణీని గత ఏడాది మార్చిలో ప్రారంభించింది. ఇప్పటివరకు జిల్లాలో 17,304 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది వేశారు.

క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌..

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసింది. నోటి క్యాన్సర్‌కు సంబంధించి 54,026 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసి 390 మంది అనుమానితులను గుర్తించింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు సంబంధించి 27,797 మందిని స్ర్కీనింగ్‌ చేసి 211 మంది అనుమానితులను, సర్వైకల్‌ క్యాన్సర్‌కు 32,680 మందిని పరీక్షించి 215 మంది అనుమానితులను గుర్తించారు. వీరందరినీ రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. వీరిలో ప్రాథమికంగా ముగ్గురికి క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రిమ్స్‌కు ప్రతి నెలా 40 మంది వరకు క్యాన్సర్‌ బాధితులు వస్తుంటారు.

Updated Date - Nov 06 , 2026 | 11:44 PM