తీరం దాటింది.. వేదన మిగిలింది
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:33 AM
Paddy crop inundated in 7,259 hectares due to cyclone జిల్లాను వణికించిన తుఫాన్ గండం గట్టెక్కింది. కళింగపట్నం వద్ద బుధవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటింది. గత మూడురోజులుగా జిల్లాను అతలాకుతలం చేసిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో ఈనెల 22న 42 మి.మీ, 23న 87.3 మి.మీ, 24న అత్యధికంగా 98.99 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
తుఫాన్ ప్రభావంతో 7,259 హెక్టార్లలో వరి పంట ముంపు
630 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
నేలకొరిగిన 152 విద్యుత్ స్తంభాలు
జలదిగ్బంధమైన రహదారులు
నేటి సాయంత్రం వరకు ఈదురుగాలుల తీవ్రత
అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
శ్రీకాకుళం/ టెక్కలి/ నందిగాం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాను వణికించిన తుఫాన్ గండం గట్టెక్కింది. కళింగపట్నం వద్ద బుధవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటింది. గత మూడురోజులుగా జిల్లాను అతలాకుతలం చేసిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో ఈనెల 22న 42 మి.మీ, 23న 87.3 మి.మీ, 24న అత్యధికంగా 98.99 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తుఫాన్ బీభత్సం వల్ల.. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై వరదనీరు పారుతోంది. జిల్లాలో 7,259 హెక్టార్లలో వరి పంట, 630 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. అత్యధికంగా సంతబొమ్మాళి మండలంలో 2,904 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. అలాగే మొక్కజొన్న పంట 459.5 హెక్టార్లలో... పత్తి 94హెక్టార్లలో ముంపునకు గురైనట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.
ముంచుకొస్తున్న వరద..
జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ.. ఒడిశా రాష్ట్రంతోపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరద ముప్పు పొంచి ఉంది. నాగావళి, వంశధార నదులకు భారీగా వరదనీరు పోటెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బహుదా నదికి 23 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... నాగావళికి 25 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నాగావళి ప్రమాద హెచ్చరిక స్థాయి 45వేల క్యూసెక్కులు అయినప్పటికీ, అకస్మాత్తుగా వచ్చే వరదలను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 86 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 221 మందికి అక్కడ ఆశ్రయం కల్పించారు. సహాయక చర్యల కోసం రెండు ఎస్‌డీఆర్‌ఎప్, ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో మోహరించాయి. అలాగే కేంద్ర, రాష్ట్రమంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
విద్యుత్ శాఖకు భారీ నష్టం..
తుఫాన్, ఈదురుగాలుల ధాటికి జిల్లావ్యాప్తంగా 83 ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. 152 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, విపత్తు నిర్వహణ బృందాలు స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టాయి. దెబ్బతిన్న అంపోలు 33 కేవీ సబ్‌స్టేషన్‌ను కేవలం 8 గంటల్లోనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 11కేవీ లైన్లన్నీ పనిచేస్తున్నాయని, తాగునీటి సరఫరాకు కూడా ఎలాంటి అంతరాయం లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు పలుచోట్ల కూలిన చెట్లను తొలగించి.. రహదారుల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నెలలో ప్రసవతేదీలు ఉన్న 42 మంది గర్భిణులను గుర్తించి, వారిని ముందుగానే సురక్షితంగా ఆస్పత్రులకు తరలించడం గమనార్హం. మరోవైపు వంశధార ఇంజనీరింగ్ అధికారుల వ్యూహాత్మక చర్యలతో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌లో ఏకంగా 1 టీఎంసీ నీటిని నిల్వ చేశారు.
అప్రమత్తంగా ఉండాల్సిందే: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
తుఫాన్ తీరం దాటినప్పటికీ.. అక్కక్కడా ఈదురుగాలులు, వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రి మీడియాతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘శ్రీకాకుళం, పోలాకి, గార, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయి. ప్రభుత్వ విభాగాలు, క్షేత్రస్థాయి అధికారులు, అత్యవసర సహాయక బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచిన ప్రాంతాలు, ఇతర నష్టాలను గుర్తించి, వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. తాగునీటి సరఫరా, వీధుల పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టి సాధారణ స్థితికి తీసుకురావాలి. దెబ్బతిన్న తీరప్రాంత, అంతర్గత రహదారులను.. వాహనాల రాకపోకలకు అనువుగా తక్షణమే మార్చాలన్నారు. నాగావళి, బాహుదా నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాల’ని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పాఠశాలల పరిసరాలు, అక్కడికి వెళ్లే రహదారులు సురక్షితంగా ఉంటేనే శుక్రవారం పాఠశాలలు తెరవాలని విద్యాశాఖకు స్పష్టం చేశారు. విపత్తు సాయం కోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.
యుద్ధప్రాతిపదికన గండి పూడ్చండి: మంత్రి అచ్చెన్నాయుడు
‘టెక్కలి సమీపంలో ఎన్‌ఎం రోడ్డు దగ్గర పూజల చెరువు గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చాలి. నందిగాం మండలం కొత్తగ్రహారం, జడ్యాడ మధ్య వంశధార ప్రధాన ఎడమకాలువపై వంతెన పునఃనిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాల’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార ఈఈ బి.శేఖరరావుకు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం గండి పడిన ప్రాంతాన్ని మంత్రి అచ్చెన్న పరిశీలించారు. ఆ ప్రాంతంలో వరి ఏమేరకు నష్టపోయిందో వివరాలు నమోదు చేయాలని ఆర్డీవో ఎం.క్రిష్ణమూర్తికి సూచించారు. పురుషోత్తమ సాగరం గండి, ప్రధాన ఎడమకాలువ 66.26వ కిలోమీటరు యూటీ వద్ద దెబ్బతిన్న ప్రాంతాలపై ఆరాతీశారు. అలాగే వంతెన కూలిన ప్రాంతాన్ని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రత్యామ్నాయంగా కాజ్‌వే నిర్మాణం చేపట్టి మెటల్‌రోడ్డు నిర్మించాలని అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్, పి.చంద్రశేఖర్, పి.జోగారావు, ఎం.బాలకృష్ణ, ఎస్.జానకిరాం, బి.గిరిబాబు, కిష్టమ్మ, అధికారులు పి.సోమేశ్వరరావు, కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు.