Share News

‘కరకట్ట’లేరా?

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:35 PM

వర్షా కాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాలకు చెందిన రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.

‘కరకట్ట’లేరా?
పొన్నాడ వద్ద కోతకు గురవుతున్న భూములు

- నాగావళి తీరంలో కానరాని గ్రోయిన్స్‌

- వరదలతో కోతకు గురవుతున్న భూములు

- ప్రతి ఏటా రైతులకు తప్పని నష్టం

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వర్షా కాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాలకు చెందిన రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ముఖ్యంగా ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురిస్తే నాగావళి పరివాహక ప్రాంతాల్లో పొలాలు ఉన్న రైతుల్లో ఆందోళన మొదలవుతుంది. వరదలకు పంట పొలాలు నదిలో కలిసిపోయి నష్టం జరుగుతుంది. ఈ సమస్య ఎప్పటినుంచో ఉన్నా శాశ్వత ప్రాతిపదికన వరద కట్టలను మాత్రం నిర్మించడం లేదు. ఇదీ ఎచ్చెర్ల మండలంలో నాగావళి నదీ తీరంలో పంట పొలాలు ఉన్న రైతుల పరిస్థితి.

ప్రతి ఏటా ఇదే పరిస్థితి..

ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట, తోటపాలెం, పొన్నాడ, బొంతలకోడూరు గ్రామాలు నాగావళి నది ఒడ్డున ఉన్నాయి. వరదకట్టలు (గ్రోయన్స్‌) లేకపోవడంతో నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ప్రవాహ దిశ మారి లక్షలాది రూపాయల విలువ చేసే పంట భూములు నాగావళి నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. 1990 సంవత్సరంలో, ఆ తర్వాత సంభవించిన వరదలకు ఈ ప్రాంత రైతులకు చాలా నష్టం జరిగింది. 1990 వరదలకు పొన్నాడలో సుమారు 100 ఎకరాలు కోతకు గురైంది. అలాగే తమ్మినాయుడుపేటలో 25 ఎకరాలు, తోటపాలెంలో 10 ఎకరాలు, బొంతలకోడూరులో 25 ఎకరాలు నాగావళి నదిలో కలిసిపోయింది. ఆ తర్వాత కూడా భూములు నదిలో కలిసిపోతూనే ఉన్నాయి. సుమారు రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిన గ్రోయన్స్‌ పాడయ్యాయి. గతంలో గ్రోయన్స్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టినా.. పనులు ముందుకు సాగలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రజాప్రతినిధులు మారుతున్నా గ్రోయన్స్‌ నిర్మాణం మాత్రం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వరద కట్టల నిర్మిస్తేనే మేలు

నాగావళి నదీతీరాన ఉన్న భూములు ఏటా కోతకు గురవుతున్నాయి. దీనివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదకట్టల నిర్మా ణంతోనే రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- పంచిరెడ్డి కృష్ణారావు, నారాయణపురం ప్రాజెక్ట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు

Updated Date - Feb 22 , 2026 | 11:35 PM