Share News

ఇదేనా ‘చెత్త’శుద్ధి?

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:00 AM

35,000 metric tons stored in dumping yard పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలో రోజూ 30 టన్నుల చెత్త పోగవుతోంది. దీనిని పెంటిభద్ర పరిధిలో డంపింగ్‌యార్డ్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం 35వేల మెట్రిక్‌ టన్నుల చెత్తనిల్వలతో డంపింగ్‌యార్డు నిండిపోయింది. దీనిని రీసైకిలింగ్‌ చేస్తే.. డంపింగ్‌ యార్డ్‌ శుభ్రమవుతుంది. మరోవైపు మునిసిపాలిటీకి కూడా ఆదాయం సమకూరుతుంది. కానీ, ఆ దిశగా చర్యలకు జాప్యమవుతోంది.

ఇదేనా ‘చెత్త’శుద్ధి?
డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్త నిల్వలు

మూడు నెలలు గడిచినా పూర్తికాని పనులు

అధికారులు హెచ్చరించినా పట్టని కాంట్రాక్టర్‌

డంపింగ్‌యార్డులో 35వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ

పునాది దశలోనే చెత్తసంపద కేంద్రాలు

పలాస, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలో రోజూ 30 టన్నుల చెత్త పోగవుతోంది. దీనిని పెంటిభద్ర పరిధిలో డంపింగ్‌యార్డ్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం 35వేల మెట్రిక్‌ టన్నుల చెత్తనిల్వలతో డంపింగ్‌యార్డు నిండిపోయింది. దీనిని రీసైకిలింగ్‌ చేస్తే.. డంపింగ్‌ యార్డ్‌ శుభ్రమవుతుంది. మరోవైపు మునిసిపాలిటీకి కూడా ఆదాయం సమకూరుతుంది. కానీ, ఆ దిశగా చర్యలకు జాప్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చెత్త నుంచి సంపద సృష్టించడానికి ఎంపిక చేసిన మునిసిపాలిటీలకు రూ.3కోట్లకు పైగా మంజూరు చేసింది. చెత్త సంపద కేంద్రాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలో మూడు నెలల కిందట సంబంధిత పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలి. చెత్తనుంచి వ్యర్థాలు, వినియోగపడే వస్తువులు తీసి పరిశుభ్రం చేయాలి. కానీ ఇంతవరకూ పనులు పునాదుల దశలోనే ఉండిపోయాయి. సకాలంలో పనులు చేయలేకపోతే అపరాధ రుసుం విధిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుంచి ఆదేశాలు ఉన్నా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది.

ఏడాది కిందట విశాఖపట్నం కేంద్రంగా ఉన్న జిందాల్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థ ఇక్కడున్న చెత్తను వెయ్యి టన్నుల వరకూ సేకరించగా.. మునిసిపాలిటీకి ఆదాయం సమకూరింది. ఆ సంస్థ కాంట్రాక్ట్‌ పూర్తి కావడంతో ఆ పనులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చేపట్టింది. కాగా.. ఆదిలోనే సంస్థ ఆశయాలకు కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తుండడం విశేషం. ప్రస్తుతం మునిసిపాలిటీలోని డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్త నిల్వలు చూసి అధికారులు సైతం వాటిని ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. డంపింగ్‌ యార్డులో చెత్తనిల్వలను వేరు చేసి ప్లాస్టిక్‌తోపాటు వినియోగపడే వ్యర్థాలు బయటకు తీయడం, మిగిలిన మట్టిని కూడా ఎరువుల కింద వినియోగించడం, వర్మీకంపోస్టు వంటివి తయారు చేసి విక్రయించడం ద్వారా మునిసిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. డంపింగ్‌ యార్డులో చెత్త నిల్వలు వెలికితీస్తే ఆ ప్రాంతంలో సుందరంగా పార్కును కూడా నిర్మించేందుకు అధికారులు అంచనాలు తయారు చేశారు. కానీ పనుల జాప్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు, మునిసిపల్‌ అధికారులు పర్యవేక్షించి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ఆశయాలను నెరవేర్చాల్సి ఉంది.

Updated Date - Sep 09 , 2026 | 12:00 AM