ఇదేనా అభివృద్ధి?
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:14 PM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో చేపడుతున్న సుడా వెంచర్ పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.
- సుడా లేఅవుట్‌లో నత్తనడకన పనులు
- కానరాని నాణ్యతా ప్రమాణాలు
- బీటలు వారుతున్న కాలువలు
పలాస, జూన్ 24(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో చేపడుతున్న సుడా వెంచర్ పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. సీసీ కాలువల పనుల్లో నాణ్యత డొల్ల స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడే బీటలు వారి కనిపిస్తున్నా యి. కొన్నిచోట్ల కాలువలు విరిగిపోయి వంకర్లు తిరిగాయి. ప్లాట్లు కొనుగోలు చేయడానికి వస్తున్న వారు ఈ పనులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
అందరికీ ప్రభుత్వ గృహాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్బన్ అథారిటీ ద్వారా భూములను కొనుగోలు చేసి వాటిని అభివృద్ధి పరిచి ఉద్యోగులు, ఇతరులకు కేటాయించడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో భాగంగా పలాస-కాశీబుగ్గ పుర ప్రజల కోసం బొడ్డపాడు రెవిన్యూ పరిధిలో ఉన్న మొత్తం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించి సుడాకు అప్పగించింది. రెండేళ్ల కిందట ప్రారంభమైన సుడా వెంచర్ పనులు ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఇప్పటికే ఒక విడత ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. మిగిలిన ప్లాట్లను కూడా వేలం ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. అయితే, సుడా చేస్తున్న ప్రకటనలకు.. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి ఎంతో తేడా ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రహదారులు, కాలువ, ఇతర అభివృద్ధి పనులు నామమాత్రంగా సాగుతుండగా కాలువ పనుల్లో నాణ్యతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కాలువలు కుంచించుకుపోగా మరికొన్ని బీటలువారి దర్శనం ఇస్తున్నాయి. వెంచర్ ప్రారంభం నుంచి వంద మీటర్ల దూరంలో నిర్మించిన కాలువ విరిగిపోయి నామరూపాలు లేకుండా పోయింది. ఎక్కడైనా ప్రైవేటు వెంచర్లు వేసేటప్పుడు పూర్తిస్థాయి అభివృద్ధి చేసి వాటిని వినియోగదారులకు చూపించడం సర్వసాధారణం. ఇక్కడ మాత్రం అధికారిక వెంచర్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్లాట్ల కేటాయింపు, అమ్మకాలు చేస్తుండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. సుడా వెంచర్ ప్రారంభంలో నిర్వహించిన ప్లాట్ల కేటాయింపులో గందరగోళ పరిస్థితి నెలకొని ఏకంగా వాటిని రద్దు చేసి విమర్శల పాలైన విషయం విధితమే. అప్పటి నుంచి ఇప్పటికీ పరిస్థితి మారలేదు. ఇంతవరకూ ఒక్క కాలువ, రహదారులు, ప్లాట్ల విభజన, తాగునీరు, విద్యుత్ వంటివాటిలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారు. అరకొరగా చేస్తున్న పనులైనా నాణ్యతతో చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.