Share News

రూ.24.8 కోట్లతో అభివృద్ధి ఇదేనా?

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:42 PM

No Facilities at Palasa Railway Station పలాస రైల్వేస్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. టిక్కెట్లపై ఏటా రూ.30కోట్ల వరకూ ఆదాయం సమకూరుతున్నా.. సౌకర్యాల కల్పనలో రైల్వేశాఖ విఫలమైంది. ఫ్లాట్‌ఫారాలపై కనీసం తాగునీరు కూడా కల్పించలేని దుస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.24.8 కోట్లతో అభివృద్ధి ఇదేనా?
పలాస రైల్వేస్టేషన్‌లో ఫ్లోరింగ్‌ లేని ఫ్లాట్‌ఫారం, ట్యాప్‌లు లేని కుళాయిలు

  • పలాస రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు కరువు

  • తాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు

  • విశ్రాంతి గది ఎక్కడుందో తెలీని పరిస్థితి

  • పలాస, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. టిక్కెట్లపై ఏటా రూ.30కోట్ల వరకూ ఆదాయం సమకూరుతున్నా.. సౌకర్యాల కల్పనలో రైల్వేశాఖ విఫలమైంది. ఫ్లాట్‌ఫారాలపై కనీసం తాగునీరు కూడా కల్పించలేని దుస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌భారత్‌ పథకం కింద ఈ స్టేషన్‌ ఆధునికీకరణకు రూ.24.8 కోట్లు మంజూరైనా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. అమృత్‌భారత్‌ కింద కటక్‌, ఖుర్ధారోడ్‌, బ్మహ్మపూర్‌ రైల్వేస్టేషన్లు పూర్తి స్థాయిలో ఆధునికీకరించిన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ అధికారులు.. తరువాత జోన్‌ మారడంతో మొత్తం పనులన్నీ నిలుపుదల చేశారు. పలాస రైల్వేస్టేషన్‌లో కేవలం 20 శాతం మాత్రమే పనులు నిర్వహించి మమః అనిపించారు. ప్రస్తుతం సౌత్‌కోస్టు రైల్వే, విశాఖ జోన్‌ పరిధిలోకి వచ్చినా.. పలాస స్టేషన్‌ అభివృద్ధిపై ఇంకా అధికారులు దృష్టి పెట్టలేదు. ఫ్లాట్‌ఫారం ఫ్లోరింగ్‌ కూడా అధ్వానంగా ఉండడంతో రైళ్లు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కుళాయిలు లేక.. ప్రయాణికుల వసతిగదులు లేక అవస్థలు తప్పడం లేదు. టిక్కెట్‌ కౌంటర్‌ ప్రాంతంలో విశ్రాంతి మందిరాన్ని నిర్మించినా.. అది ఎక్కడ ఉందో ప్రయాణికులకు తెలియని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 11:42 PM