Share News

అర్జీల పరిష్కారంలో ఇంత నిర్లక్ష్యమా?

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:47 AM

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఇంత నిర్లక్ష్యమా? అంటూ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్జీల పరిష్కారంలో ఇంత నిర్లక్ష్యమా?
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై సిబ్బందిని ప్రశ్నిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు

  • రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరిక

జలుమూరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఇంత నిర్లక్ష్యమా? అంటూ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మా ర్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని అక్కురాడ రెవెన్యూ గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రీసర్వే తర్వాత ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి రైతులకు తప్పులు లేకుండా పాసుపుస్తకాలు అందించాలని ప్రభుత్వం ల క్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. అక్కురాడ రెవెన్యూ లో ఎన్ని అర్జీలు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారు? అని సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ గ్రామానికి వచ్చి రైతుల నుంచి అర్జీలు స్వీకరించి నాలుగు రోజులైంద ని, ఎన్ని సమస్యలు పరిష్కరించారని ప్రశ్నించారు. ఒక సమస్య కూడా పరిష్కరించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగులో ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన రైతులందరికీ సత్వరమే పాసుపుస్తకాలు ఇవ్వాలని తహసీల్దారు జె.రామారావును ఆదేశించారు.

ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌నుకోరారు. సమావేశంలో శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డీఎం వేణుగోపాలరావు, రీ సర్వే డీటీ ఆర్‌.పుష్పలత, ఆర్‌ఐ జగదీష్‌, సివిల్‌ సప్లై డీటీ జాఫర్‌ షరీఫ్‌, మండల సర్వేయర్‌ తర్ర నాగేశ్వరరావు, పలువురు వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:47 AM