Share News

ఆ కుటుంబం తప్ప ఎవరూలేరా?

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:16 AM

In Ichchapuram Municipality, a shock for the YSRCP ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో వైసీపీకి అసమ్మతి సెగ తగులుతోంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక, కౌన్సిలర్‌ టికెట్ల కేటాయింపు వ్యవహారాలు పార్టీలో విభేదాలకు కారణమవుతున్నాయి. పిలక రాజ్యలక్ష్మికి వరుసగా మూడోసారి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆ కుటుంబం తప్ప ఎవరూలేరా?

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో వైసీపీకి భారీ షాక్‌

ముగ్గురు తాజా మాజీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా

మూడోసారి రాజ్యలక్ష్మికి చైర్‌పర్సన్‌ టికెట్‌ ఇవ్వడంపై అసంతృప్తి

ఒకే కుటుంబానికి ప్రాధాన్యమిస్తున్నారంటూ సీనియర్ల ఆగ్రహం

అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు

ఇచ్ఛాపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో వైసీపీకి అసమ్మతి సెగ తగులుతోంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక, కౌన్సిలర్‌ టికెట్ల కేటాయింపు వ్యవహారాలు పార్టీలో విభేదాలకు కారణమవుతున్నాయి. పిలక రాజ్యలక్ష్మికి వరుసగా మూడోసారి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి దశాబ్దాలుగా ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు వార్డుల రిజర్వేషన్ల కారణంగా ఈసారి పోటీకి అవకాశం కోల్పోయిన తాజా మాజీ కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నారు. తాజాగా పల్లంటి వెంకటప్రసాద్‌, రెయ్యి నారాయణ, బోనెల ఆనంద్‌ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

పదవుల పంపకంపై అసమ్మతి

ఇచ్ఛాపురంలో పిలక రాజ్యలక్ష్మికి మూడోసారి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై కొంతమంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే చైర్‌పర్సన్‌ పదవిని పంచుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న ఉలాల భారతి దివ్య కనీసం చివరి రెండేళ్లయినా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే ఆమెకు ఈసారి కూడా అవకాశం దక్కలేదు. మరోవైపు ఒకే వార్డుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉలాల భారతి దివ్యతోపాటు డాక్టర్‌ ఉలాల కోదండరాం భార్య జ్యోతి కూడా నామినేషన్‌ వేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బయటపడ్డాయి. మహిళలకు ఎక్కువ వార్డులు రిజర్వు కావడంతో పలువురు తాజా మాజీ కౌన్సిలర్లకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారిలో కొందరు పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా ముగ్గురు మాజీ కౌన్సిలర్లు రాజీనామా చేయడం వైసీపీకి ఎదురుదెబ్బగా మారింది.

పాగా వేయాలని టీడీపీ వ్యూహం

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది. వైసీపీలో పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులతో విప్‌, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకరిద్దరు నాయకులతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా నేరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఆ పార్టీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. 1995లో మునిసిపాలిటీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్‌, వైసీపీ పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ఫ్లైఓవర్‌ పనులతోపాటు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వైసీపీకి చెందిన పలువురు నాయకులు పార్టీని వీడుతుండటంతో పలు వార్డుల్లో ఆ పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు మునిసిపల్‌ ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని టీడీపీ ఆశిస్తోంది.

Updated Date - Oct 19 , 2026 | 12:16 AM