నీరు సురక్షితమేనా?
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:24 AM
Unprecedented water quality tests శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తికి ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా కారణమని తాగునీటి నమూనాల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం తాగేనీరు ఎంతవరకు సురక్షితమన్న ప్రశ్న జిల్లావాసుల్లో తలెత్తుతోంది.
జిల్లాలో కానరాని నీటి నాణ్యత నిర్ధారణ పరీక్షలు
సచివాలయాల్లో నిరూపయోగంగా కిట్లు
ప్రజలకు తప్పని అవస్థలు
ఇచ్ఛాపురం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తికి ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా కారణమని తాగునీటి నమూనాల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం తాగేనీరు ఎంతవరకు సురక్షితమన్న ప్రశ్న జిల్లావాసుల్లో తలెత్తుతోంది. ఎందుకంటే రక్షితనీటి పథకాలు దశాబ్దాల కిందట నాటివి. చాలాచోట్ల పైపులైన్లు శిథిలమయ్యాయి. కలుషిత నీరు చేరుతోంది. ఇటువంటి సమయంలో నీటి నాణ్యతా నిర్ధారణ పరీక్షలు అవసరం. కానీ జిల్లాలో ఎక్కడా సవ్యంగా నిర్వహించడం లేదు. మూడున్నరేళ్ల కిందట ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 97 పంచాయతీలకు నీటి నాణ్యతా పరీక్షలకు కిట్లు అందించారు. ఒక్కో కిట్ ధర రూ.7,700. ఇంకా వాటికి 2028 వరకూ వినియోగ గడువు ఉంది. సచివాలయ ఇంజనీరింగ్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పరిశీలించకపోవడంతో అవి వృథాగా ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 1075 గ్రామాల్లో రక్షితనీటి ట్యాంకులు ఉన్నాయి. ఒక్కో ట్యాంకు లక్ష మంది వరకూ తాగునీరు అందిస్తోంది. కాగా చాలా ట్యాంకుల మెట్లు, నిచ్చెనలు పాడయ్యాయి. లీకులకు గురవుతున్నాయి. ట్యాంకులపై మొక్కలు మొలచి, పక్షులు మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. కనీసం శుభ్రం చేసిన దాఖలాలు లేవు. దీంతో తాగునీరు గరళంగా మారి ప్రజారోగ్యానికి విఘాతంగా కలుగుతోంది. మూడున్నరేళ్ల కిందట జిల్లాలో 912 పంచాయతీలకు నీటి నాణ్యతా నిర్ధారణ పరీక్షలకుగాను కిట్లు ఇచ్చారు. కానీ అవి నిరుపయోగంగా మారాయి. ప్రతి పంచాయతీలో రక్షితనీటి పథకాన్ని పరిశీలించాలి. నీటి పరీక్షలు చేయాలి. నీటిలో లవణాల లభ్యత, మడ్డితనం, సల్ఫర్, కాల్షియం, ఏ మేరకు ఉన్నాయో పరీక్షించాలి. లోపాలుంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ టెక్నికల్ సిబ్బంది లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదు. దీంతో కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారినపడుతున్నారు.
ఉద్దానానికి కష్టం..
ఉద్దానంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంటుంది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ఉద్దానం సమగ్రనీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌లో మదర్ ట్యాంకును నిర్మించి అక్కడి నుంచి మెళియాపుట్టి వద్ద శుద్ధప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి నీటిని ట్యాంకర్లలో విడిచిపెడుతున్నారు. అక్కడ నుంచి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకులు సరిగ్గా లేకపోవడంతో నీరు కలుషితమవుతోందని ఉద్దానం గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు.
ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి రూ.750 కోట్లు ఖర్చుచేశారు. కొత్త ట్యాంకులను సైతం నిర్మించారు. కానీ చాలా పాత ట్యాంకులకు సైతం అనుసంధానం చేశారు. వీటితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్షితనీటి ట్యాంకులను విధిగా రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. అయితే ఎక్కడా శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్‌డబ్ల్యూఎస్ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని ట్యాంకులపై పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాన్ని మెగా కంపెనీ నిర్వహిస్తోంది. వారికి ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బందికి మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో మంచినీటి పథకాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. సచివాలయాలకు ఇచ్చిన నీటి నాణ్యతా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కిట్లు వినియోగంలోకి తేవాలి.
సత్వర చర్యలు
రక్షితనీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక సంస్థలు సైతం సహకరించాలి. పైపులైన్లు, మోటార్లు, ట్యాంకర్ల మరమ్మతులు చేపడతాం. ప్రజల నుంచి ఫిర్యాదులకు సత్వర పరిష్కార మార్గం చూపిస్తాం. ప్రతీ రోజూ బయాలజికల్ టెస్ట్, క్లోరినేషన్ టెస్ట్, చేస్తున్నాం.
- విష్ణుమూర్తి, ఏఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇచ్ఛాపురం