Share News

ఖరీఫ్‌ గట్టెక్కినట్లేనా?

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:36 AM

ఎల్‌నినో కారణంగా ఇక కరువు తప్పదనుకున్న వేళ ఏర్పడిన తుఫాన్‌ రైతుల పాలిట వరంలా మారింది.

 ఖరీఫ్‌  గట్టెక్కినట్లేనా?
పలాస: నిండుగా ప్రవహిస్తున్న దేశబట్టి కాలువ

- తుఫాన్‌తో జిల్లాలో కురిసిన భారీ వర్షాలు

- నిండుగా సాగునీటి వనరులు

- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

- పంటలపై చిగురిస్తున్న ఆశలు

- మిగిలిన భూముల్లో నాట్లు వేసేందుకు సన్నద్ధం

- జీడి, కొబ్బరి తోటలకు మేలు

పలాస/వజ్రపుకొత్తూరు/కోటబొమ్మాళి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ఇక కరువు తప్పదనుకున్న వేళ ఏర్పడిన తుఫాన్‌ రైతుల పాలిట వరంలా మారింది. నీరు లేక వరి పొలాలు ఎండిపోతున్న సమయంలో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టాయి. దీంతో చెరువులు, బావులు, పొలాల్లో నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సాగు చేయకుండా వదిలేసిన భూముల్లో ఇప్పుడు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పలాస మండలంలో వరహాలగెడ్డ, హరిసాగరం, జగన్నాథసాగరం, కుంకుమసాగరం, దేశబట్టి, వంశధార కాలువలు ప్రధాన సాగునీటి వనరులు. ఇప్పటి వరకూ వంశధార నీరు ఒక్కసారి మాత్రమే విడుదల కావడంతో రైతులు దానికింద ఉన్న 4,500 ఎకరాల్లో వరి విత్తనాలు చల్లుకున్నారు. మిగిలినవన్నీ వర్షాధారం కావడంతో జూలై, ఆగస్టులో చిన్నచినుకులు పడగానే విత్తనాలు వేసుకున్నారు. తరువాత ఒక్కసారి కూడా వర్షం లేకపోవడం, వంశధార నీరు కూడా రాకపోవడంతో ఇక కరవు తప్పదని రైతులంతా భావించారు. అయితే, తుఫాన్‌ కారణంగా ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులన్నీ నీటితో నిండిపోగా, పొలాల్లో కూడా ముడుకు లోతులో నీరు చేరింది. దీంతో ఎండిపోతున్న పంటలకు ఊపిరి వచ్చినట్లయింది. మండలంలో మొత్తం 11,430 ఎకరాలు ప్రస్తుతం సాగులో ఉంది. ఇంకా ఉద్దానం గ్రామాల్లో సాగు చేయకుండా వదిలేసిన 600 ఎకరాల్లో ఇప్పుడు నీరు చేరడంతో దమ్ములు పెట్టడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కరువు ముప్పు తప్పినట్లేనని వ్యవసాయాధికారి పోలారావు తెలిపారు.

- వజ్రపుకొత్తూరు మండలంలోని తాడివాడ, గుల్లలపాడు, సీతాపురం తదితర గ్రామాల్లో వంశధార ఆధారిత చెరువుల కింద వందలాది ఎకరాలు సాగువుతున్నాయి. మొన్నటి వరకూ చెరువుల్లో నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత వర్షాలకు బెండి గెడ్డ నుంచి వంశధార, దేశబట్టి కాలువల్లో నీరు పొంగి ప్రవహిస్తుండడంతో వేసుకున్న పంటకు ఢోకా లేదని రైతులు చెబుతున్నారు.

జీడి, కొబ్బరి పంటలకు మేలు

జీడి, కొబ్బరి పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. ఏడాదిగా సరైన వర్షాలు లేకపోవడంతో జీడి, కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గిపోయి రైతాంగానికి ఆదాయం పడిపోయింది. ఈ తరుణంలో వర్షాలు కురవడంతో దిగుబడి పెరిగే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన తితలీ తుఫాన్‌తో ఉద్దానంలో కొబ్బరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కొబ్బరి తేరుకుంటుంది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో దిగుబడి ఒక్కసారిగా తగ్గిపో యింది. అయితే, తుఫాన్‌ కారణంగా వజ్రపుకొత్తూరు మండలంలో వర్షపాతం అధికంగా నమోదుకావడంతో జీడి, కొబ్బరి చెట్లకు జీవం పోసినట్లయింది. భూగర్భ జలాలు కూడా పెరిగాయని ఉద్దాన వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెట్టు ప్రాంతంలో పంటలు చేతికొచ్చినట్లే..

కోటబొమ్మాళి మండలంలో మెట్టు ప్రాంతం ఎక్కువ. కురుడు, దంత, చీపుర్లపాడు, పొన్నానపేట, ఊడికలపాడు, రామయ్యపేట, తర్లిపేట, చిన్నసాన, సౌడాం, చౌదరికొత్తూరు, రేగులపాడు, తిలారు తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా వర్షాధారంగా, ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపుకొని వరి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, ఎత్తిపోతల ద్వారా పంటకు తగినంత నీరు అందక, చెరువులు నిండక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో మూడు రోజుల పాటు వర్షాలు కురవడంతో పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు అంటున్నారు. పంటలు చేతికి వచ్చినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వరి పంటలకు ఇబ్బంది లేదు..

ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలకు వరి ఎదలు వేసుకున్నాం. తరువాత వానలు లేకపోవడంతో చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఇంజన్ల ద్వారా తోడి పంటలను ఇప్పటి వరకు కాపాడుకొచ్చాము. చెరువుల్లో నీరు లేదు, ఏమీ చేయాలిరా దేవుడా అన్న సమయానికి ఈ తుఫాన్‌ వల్ల కురిసిన వర్షాలకు అవి నిండిపోయాయి. దీంతో వరి పంటలకు ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేదు.

- హనుమంతు ఆదినారాయణ, రైతు, ఊడికలపాడు, కోటబొమ్మాళి మండలం.

Updated Date - Sep 28 , 2026 | 12:36 AM