గ్యాస్ సక్రమంగా అందుతోందా?
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:07 AM
Center inquiry through IVRS call గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు పంపిణీ చేసే సిలిండర్లు పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిలిండర్లు డెలివరీ అయిన వారం రోజుల్లోపు వినియోగదారులకు ఐవీఆర్‌ఎస్ కాల్ చేస్తోంది. గ్యాస్ పంపిణీ తీరు, డెలివరీ సిబ్బంది ప్రవర్తనపై ఆరా తీస్తోంది.
సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారా?
ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా కేంద్రం ఆరా
అక్రమాలకు చెక్ పెట్టేలా ప్రజాభిప్రాయ సేకరణ
కొత్త కనెక్షన్ల కోసం తప్పని నిరీక్షణ
నరసన్నపేట, జూన్ 25(ఆంధ్రజ్యోతి): గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు పంపిణీ చేసే సిలిండర్లు పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిలిండర్లు డెలివరీ అయిన వారం రోజుల్లోపు వినియోగదారులకు ఐవీఆర్‌ఎస్ కాల్ చేస్తోంది. గ్యాస్ పంపిణీ తీరు, డెలివరీ సిబ్బంది ప్రవర్తనపై ఆరా తీస్తోంది. గతంలో కొన్ని ఏజెన్సీల సిబ్బంది వినియోగదారులకు తెలియకుండానే వారి పేరు మీద గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి.. బ్లాక్‌లో అధిక ధరకు విక్రయించేవారు. ఇటువంటి అక్రమాలపై నిఘా పెంచిన కేంద్రం ముందస్తుగా గ్యాస్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసింది. దీంతో ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నారో.. ఎన్ని కనెక్షన్లు బోగస్ ఉన్నాయో తేల్చింది. ఇంకా క్షేత్రస్థాయిలో సిలిండర్ల పంపిణీలో కూడా పలు అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఐవీఆర్‌ఎస్ కాల్ విధానం ద్వారా ఆరా తీస్తోంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యలో గ్యాస్ కొరత తీవ్రమై ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో గ్యాస్ పంపిణీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పంపిణీ చేస్తున్న స్థాయిలో వినియోగం లేకపోవడాన్ని గ్రహించి.. సిబ్బంది అక్రమాలకు చెక్ పెడుతోంది.
జిల్లాలో 43 ఏజెన్సీల పరిధిలో 6,92,825 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పలు ఏజెన్సీల సిబ్బంది వినియోగదారులకు సిలిండర్లను పంపిణీ చేసే సమయంలో రవాణాచార్జీ పేరిట రూ.20 నుంచి రూ.70 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్యాస్ డెలివరీ చార్జీలను ఆయా ఏజెన్సీలకు కంపెనీలు చెల్లిస్తాయి. కానీ జిల్లాలో మాత్రం అదనంగా డబ్బులు వసూలు చేసి దోచేస్తున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తే.. దురుసుగా ప్రవర్తించడం.. ఆపై సిలిండర్ పంపిణీ జాప్యం చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా ఇటువంటి వాటిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. సిబ్బంది పనితీరుపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటే సంబంధిత గ్యాస్ కంపెనీలకు నోటీసులు జారీ చేస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే గ్యాస్ ఏజెన్సీలు సైతం రద్దు చేయనుంది.
కొత్త కనెక్షన్లు బంద్
జిల్లావ్యాప్తంగా గ్యాస్ తిప్పలు కొనసాగుతున్నాయి. మూడు నెలలుగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ల మంజూరు బంద్ అయ్యాయి. గతంలో ఒక్కరోజులోనే కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యేవి. డబుల్ సిలిండర్ కనెక్షన్ కూడా వెంటనే దొరికేది. ఇపుడా పరిస్థితి మారింది. కనెక్షన్ల బుకింగ్‌లు నిలిచిపోయాయి. ఏ డీలర్‌ను అడిగినా ఇప్పట్లో కనెక్షన్లు వచ్చే అవకాశం లేదంటున్నారు. నూతన దంపతులకు వారి పేరిట కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ సాధించడం ప్రహసనంగా మారింది. కొత్త కనెక్షన్లు మంజూరుకాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టౌలు వినియోగిస్తున్నారు.
సిబ్బందికి బాధ్యత
గతంలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే సిలిండర్ వచ్చినా.. సిబ్బంది కొన్నాళ్ల తరువాత ఇచ్చేవారు. ప్రస్తుతం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ఆరా తీయడంతో సిబ్బందికి బాధ్యత పెరిగింది. వినియోగదారులకు త్వరగా సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు.
- నేతింటి భారతి, నరసన్నపేట
అక్రమాలకు కళ్లెం
గ్యాస్ పంపిణీలో అక్రమాలకు కళ్లెం చేసేందుకు ఐవీఆర్‌ఎస్ విధానం దోహదపడుతుంది. సిబ్బంది వినియోగదారులతో వ్యవహరించే విధానంపై ప్రజాభిప్రాయం సేకరించడంతో బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఎవరైనా సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడితే ఐవీఆర్‌ఎస్ లేదా నేరుగా మాకు వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు.
- సూర్యప్రకాశరావు, డీఎస్‌వో, శ్రీకాకుళం