Share News

ఏడాదిలో సాధ్యమేనా?

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:10 AM

Flyover works progressing in slowly రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది జనవరి 17 నుంచి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు వరకూ వేగవంతం అయ్యాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి మందగించాయి.

ఏడాదిలో సాధ్యమేనా?
రణస్థలంలో కొనసాగుతున్న ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు

  • రణస్థలంలో నత్తనడకన ఫ్లైఓవర్‌ పనులు

  • వేధిస్తున్న డీజిల్‌ కొరత.. పెరిగిన నిర్మాణ సామగ్రి ధర

  • వచ్చే ఏడాది జూన్‌ వరకూ గడువు

  • 50 శాతం కూడా పూర్తికాని వైనం

  • ప్రజలకు, వాహనదారులకు రవాణా కష్టాలు

  • రణస్థలం, జూలై 14(ఆంధ్రజ్యోతి):

  • రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది జనవరి 17 నుంచి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు వరకూ వేగవంతం అయ్యాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి మందగించాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకూ 50 శాతం పనులు కూడా జరగలేదు. సదరు కాంట్రాక్ట్‌ సంస్థకు జాతీయ రహదారి అధికారులు సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది లోపు వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

  • డీజిల్‌ దొరక్క.. నిధులు చాలక..

  • రణస్థలంలో 4.7 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.187 కోట్లకు టెండర్లను పిలిచింది. రూ.137కోట్లకు ఒక కంపెనీ టెండరు దక్కించుకుంది. ప్రారంభంలో పనులు జోరుగా సాగాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. డీజిల్‌ కొరత ఏర్పడింది. రోజుకు ఇక్కడ పనులు చేసేందుకు 3 వేల లీటర్ల డీజిల్‌ అవసరం. కానీ 400 లీటర్లు కూడా లభించడం కష్టమవుతోందని కాంట్రాక్టరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. తారు సైతం అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో ఇంధనంతో పాటు నిర్మాణ సామగ్రి కంపెనీలు అవసరమైన వాటిని ముందుగా అందించేవని.. తర్వాత డబ్బులు చెల్లించేవారమని పేర్కొన్నారు. ఇప్పుడు ముందుగా డబ్బులు చెల్లించినా.. ఇంధనం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నిర్మాణ సామగ్రితోపాటు డీజిల్‌ ధర కూడా పెరగడంతో అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు. టెండరు ప్రకారం నిధులు చాలవని, అంచనా వ్యయం పెంచాలని కోరుతున్నారు. మరోవైపు వంతెన నిర్మాణం చేపడుతున్న కంపెనీకి జాతీయ రహదారుల శాఖ అధికారులు సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

  • ప్రజలకు నరకయాతన..

  • ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. వంతెన నిర్మాణం చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే రణస్థలం అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వంతెన నిర్మాణ పనులతో స్థానికులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అటువైపు ఉన్నవారు.. ఇటువైపు రావాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒకవైపు మండల కార్యాలయాలు, మరోవైపు పోలీస్‌స్టేషన్‌తో పాటు బ్యాంకులు ఉన్నాయి. ఈ క్రమంలో రాకపోకలు సాగించినప్పుడు నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతానికి మండల కేంద్రంలోని ప్రధాన ప్రాంతంలో స్తంభాలు పునాదులు దాటాయి. అటు ఇటుగా మిగతా ప్రాంతాల్లో ఇంకా స్తంభాల పనులు ప్రారంభం కాలేదు. గడువు చూస్తే ఇంకా ఏడాది కూడా లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా ఎమ్మెల్యే, ఎంపీలు.. జాతీయ రహదారి అధికారులు, కాంట్రాక్టు సంస్థతో మాట్లాడాలని స్థానికులు కోరుతున్నారు.

  • పనులపై కలెక్టర్‌, ఎస్పీ అసంతృప్తి:

  • ప్లైఓవర్‌ నిర్మాణ పనులపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం, జాతీయ రహదారి విస్తరణ పనులను వారిద్దరూ పరిశీలించారు. పనులు చేసే విధానం ఇదేనా? పనులు సకాలంలో చేయండి లేదంటే తప్పుకోండని సంబంధిత కాంట్రాక్టర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారికి సంబంధించిన స్థలం ఎంతవరకు ఉందో స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. దీంతో జాతీయ రహదారి విస్తరణ అధికారులు మరికొంత స్థలాన్ని స్వాధీన పరుచుకొనేందుకు మార్కింగ్‌ ఇచ్చారు. ఆక్రమణలు తొలగించే చర్యలు చేపడుతున్నారు.

  • చాలా భయమేస్తోంది

  • ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయమేస్తోంది. రోడ్డు అవతలివైపు బ్యాంకులు, ఇతర కార్యాలయాలకు వెళ్లేందుకు కుదరడం లేదు. అటువైపు వారు ఇటువైపు వచ్చేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన చెందుతున్నాం.

    - టి.లక్ష్మణరావు, రణస్థలం

Updated Date - Jul 15 , 2026 | 12:10 AM