సాగునీరొస్తోంది
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:26 AM
Release water through Vamsadhara canals ఖరీఫ్ సాగుకు వంశధార కదలివస్తోంది. సోమవారం హిరమండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్ గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేశారు. ముందుగా వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ జి.రామచంద్రరావు, కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
వంశధార కాలువల ద్వారా విడుదల
హిరమండలం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సాగుకు వంశధార కదలివస్తోంది. సోమవారం హిరమండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్ గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేశారు. ముందుగా వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ జి.రామచంద్రరావు, కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. జిల్లాలో ఎడమ కాలువ ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాల్లో 398 గ్రామాల్లోని 1,48,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. కుడి ప్రధాన కాలువ ద్వారా హిరమండలం, ఎల్.ఎన్.పేట, బూర్జ, సరుబుజ్జిలి, గార, ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లోని 165గ్రామాల్లో 82,280 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ముందుగా ఎడమ కాలువ ద్వారా 240 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో నీటిని విడిచిపెడతామని ఎస్‌ఈ రామచంద్రరావు తెలిపారు. ప్రస్తుతం క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కులు వస్తుందన్నారు. శివారు భూములకు సైతం సాగునీరు అందజేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీ కమిటీ చైర్మన్ కింజరాపు సత్యనారాయణ, సిమ్మ చంద్రశేఖర్, గొట్టాబ్యారేజీ ఈఈ డీఈలు సరస్వతి, రామకృష్ణ, ఎన్.గణేష్, ఎస్.శ్రీనివాసరావు, ఏఈలు యూ.ఆనంద్, ధనుంజయ, పరిశుద్ధబాబు, అంబావల్లి నీటి సంఘం అధ్యక్షుడు చెట్టు శ్రీనివాసరావు పాల్గొన్నారు.