Share News

సాగునీరు.. సముద్రంపాలు

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:50 AM

Irrigation water difficulties వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా అరకొరగానే సాగునీరు అందుతోంది. శివారు ప్రాంతాలకు, ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికీ వంశధార సాగునీరు దరిచేరని దుస్థితి నెలకొంది.

సాగునీరు.. సముద్రంపాలు
టెక్కలి సమీపంలో వంశధార కాలువ ద్వారా అరకొరగా సాగునీరు

  • వంశధారలో నీరున్నా ఆయకట్టుకు సరిగా అందలే

  • టెక్కలి ప్రాంతానికి 415 క్యూసెక్కులకే పరిమితం

  • గొట్టాబ్యారేజీ నుంచి సముద్రంలోకి 1,210 క్యూసెక్కులు

  • నీరు వృఽథా చేయొద్దని మంత్రి అచ్చెన్న ఆదేశం

  • ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు భయపెడుతుంటే మరోవైపు కొందరు అధికారుల అలసత్వంతో సాగునీరు సముద్రం పాలవుతోంది. వంశధార ప్రాజెక్టు పరిధిలో నీరు పుష్కలంగా ఉన్నా కాల్వలు సరిగా లేకపోవడం, గండిపడిన చోట పనుల్లో జాప్యం కారణంగా టెక్కలి డివిజన్‌ పరిధిలోని ఖరీఫ్‌ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొట్టా బ్యారేజి నుంచి ప్రతిరోజూ 1210 క్యూసెక్కులు సముద్రంలోకి వృథాగా పోతున్నా, చివరి ఆయకట్టుకు రైతులకు మాత్రం నీరు అరకొరగా అందుతోంది. ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు.. చుక్క నీరు కూడా వృథా కాకూడదని.. చెరువులను నింపి రైతులకు నీరు అందించాలని ఆదేశించారు.

  • టెక్కలి, జూలై 26(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా అరకొరగానే సాగునీరు అందుతోంది. శివారు ప్రాంతాలకు, ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికీ వంశధార సాగునీరు దరిచేరని దుస్థితి నెలకొంది. ఒడిశా క్యాచ్‌మెంట్‌ గురండి ప్రాంతంలో రెండు రోజుల కిందట 75మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో ప్రస్తుతం గొట్టాబ్యారేజీలోకి 3,224 క్యూసెక్కులు నీరు వస్తోంది. వంశధార అధికారులు మాత్రం ప్రధాన ఎడమకాలువ వెంబడి 1,600 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 414 క్యూసెక్కుల సాగునీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 1,210 క్యూసెక్కుల సాగునీరు సముద్రంలోకి పోతోంది.

  • ప్రధాన ఎడమకాలువ ద్వారా 2,450 క్యూసెక్కులకు అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 1,600 క్యూసెక్కులు విడిచిపెట్టడంతో టెక్కలి డివిజన్‌కు కనీసం 415 క్యూసెక్కుల సాగునీరు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం ఇటీవల నరసన్నపేట డివిజన్‌లోని అక్కివలస సమీపంలో(16వ కిలోమీటరు వద్ద) పడిన గండి. దీనికితోడు ఆ డివిజన్‌ పరిధిలో ప్రధాన ఎడమకాలువ వెంబడి అంతంతమాత్రంగా పనులు జరగడంతో అధికారులు పూర్తిస్థాయిలో సాగునీటిని విడిచిపెట్టలేక పోతున్నారు.

  • టెక్కలి డివిజన్‌కు సుమారు 850 క్యూసెక్కుల సాగునీరు రావాల్సి ఉన్నా శివారు ప్రాంతాలకు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం 415 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. ఎడమ కాలువ ద్వారా లక్షా48వేల ఎకరాల ఆయకట్టు, అలాగే ఎత్తిపోతల పథకాలు ద్వారా మరో 30వేల ఎకరాలు అదనపు ఆయకట్టు ఉన్నా ఎత్తిపోతల పథకాల ద్వారా అసలు సాగునీరే ఇవ్వని దుస్థితి నెలకొంది. ప్రధాన ఎడమ కాలువ ద్వారా పలాస మండలం బంటుకొత్తూరు వరకు అరకొరగా సాగునీరు వెళ్తున్నా మిగిలిన ప్రాంతాల్లో గగనమైపోయింది. మొత్తంగా గొట్టాబ్యారేజీ నుంచి సముద్రంలోకి వృఽథాగా సాగునీరు పోతుందే తప్ప.. కాలువల వెంబడి పూర్తిస్థాయి నీటిని వంశధార అధికారులు సరఫరా చేయలేకపోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • టెక్కలి డివిజన్‌కు ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఏమేరకు సాగునీరు వస్తుందని వంశధార ఈఈ బి.శేఖరరావు వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం 400 క్యూసెక్కులకు పైగా వస్తోందని, దీన్ని ఆయా ప్రాంతాలకు సర్దుబాటు చేస్తున్నామన్నారు. అలాగే ఇటీవల అక్కివలస సమీపంలో గండి పూడ్చిన ప్రాంతంలో చెమ్మ కనిపిస్తుండడంతో పూర్తిస్థాయిలో సాగునీరు విడిచిపెట్టలేకపోతున్నామని ఎస్‌ఈ జి.రామచంద్రరావు తెలిపారు.

  • ‘ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. చుక్కనీరు కూడా సముద్రంలోకి విడిచిపెట్టకుండా చర్యలు చేపట్టండి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రతి ఆయకట్టు పరిధిలో చెరువులైనా నింపండి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార అధికారులను ఆదేశించారు. సాగునీరు వృథా చేయొద్దని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Updated Date - Jul 27 , 2026 | 12:50 AM