శివారు భూములకూ సాగునీరు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:37 PM
Retention of water from Gotta Barrage into the sea శివారుప్రాంత భూములకు కూడా సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వంశధార ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఉన్నతాఽధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి/ టెక్కలి, జూలై 13(ఆంధ్రజ్యోతి): శివారుప్రాంత భూములకు కూడా సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వంశధార ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఉన్నతాఽధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువల ఆధునికీకరణ, తక్షణ మరమ్మతులపై చర్చించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా రైతులకు అందిస్తున్న సాగునీరు ఎక్కడా వృథా కాకూడదు. నీటి లభ్యతను బట్టి పలాస వరకు ఉన్న ప్రతీ ఎకరాకు, శివారు భూములకు సైతం నీరందించేలా నిరంతరం పర్యవేక్షించాలి. మిగులు జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోకుండా.. సాగు అవసరాలకే వినియోగించేలా చర్యలు చేపట్టాలి. కాలువల గట్లు బటహీనంగా ఉన్నచోట, తూముల వద్ద నీటి లీకేజీలు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నీటి చౌర్యాన్ని అరికట్టడంతో పాటు, కాలువల ద్వారా పొలాలకు సక్రమంగా సాగునీటిని అందించాల’ని ఆదేశించారు. సాగునీటి ఇబ్బందులపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, బీఆర్ వంశధార ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేఖర్‌రాబు, టెక్కలి, నరసన్నపేట డివిజన్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీధర్, శ్రీను, జూనియర్ ఇంజనీర్ ధర్మాన లోకేష్‌తోపాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
గొట్టాబ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు నిలుపుదల
గొట్టాబ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని అధికారులు నిలుపుదల చేశారు. సముద్రంలోకి 249 క్యూసెక్కులు పోతుండడంతో.. ‘గొట్టాబ్యారేజీ నీరు వృథా’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. వృథా నీటిని నిలిపివేసినట్టు వంశధార ఎస్‌ఈ జి.రామచంద్రరావు తెలిపారు. ‘గొట్టాబ్యారేజ్‌లోకి ఇన్‌ఫ్లో 2,300 క్యూసెక్కుల వస్తుండగా, ఔట్‌ఫ్లో 2,223 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నాం. వంశధార ప్రధాన ఎడమకాలువ ద్వారా మరమ్మత్తులు చేపట్టిన తర్వాత 1,809 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 414 క్యూసెక్కులు సోమవారం నుంచి విడిచిపెట్టామ’ని ఎస్‌ఈ తెలిపారు.