సాగునీటి కష్టాలు తీరనున్నాయ్
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:09 AM
Rs. 7.88 crore sanctioned for lift irrigation schemes టెక్కలి నియోజకవర్గం పరిధిలో సాగునీటి కష్టాలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెక్కలి మండలం మదనగోపాలసాగరం, కోటబొమ్మాళి మండలం కొండపేట ఎత్తిపోతల పథకం పనులకు మోక్షం లభించనుంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.7.88 కోట్లు నిధులు మంజూరు చేసింది.
మదనగోపాలసాగరం, కొండపేట ఎత్తిపోతల పథకాలకు రూ.7.88 కోట్లు మంజూరు
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గం పరిధిలో సాగునీటి కష్టాలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెక్కలి మండలం మదనగోపాలసాగరం, కోటబొమ్మాళి మండలం కొండపేట ఎత్తిపోతల పథకం పనులకు మోక్షం లభించనుంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.7.88 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి శుక్రవారం జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘మదనగోపాలసాగరం పరిధిలో 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. జగన్నాథపురం, పాత్రపురం, నరహరిపురం, గడూరు, పాలసింగి గ్రామాలకు, అలాగే మొఖలింగాపురం పంచాయతీ పరిధి బెండకాయలపేట, మొఖలింగాపురం, లంకపాడు, చిన్నకేదారి గ్రామాల శివారు ప్రాంతాలకు సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ఆధునికీకరణ పనులకు రూ.4.11 కోట్లు మంజూరు చేసింది. కొండపేట ఎత్తిపోతల పథకం పరిధిలో 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ.3.77 కోట్లు కేటాయించింది. త్వరితగతిన పనులు ప్రారంభించి.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కనీసం కాలువల మరమ్మతులు చేపట్టలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింద’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎత్తిపోతల పథకాల పనులకు నిధులు మంజూరుపై ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల కల.. మంత్రి అచ్చెన్న చొరవతో నెరవేరిందని ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, నందిగాం టీడీపీ అధ్యక్షుడు పినకాన జోగారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, పోలాకి షణ్ముఖరావు, గుజ్జూరు సత్యం తెలిపారు.