రైతులకు పెట్టుబడి.. దళారులకు లాభం
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:40 AM
What are the corn purchasing centers? వ్యవసాయ రంగంలో పంట మార్పిడిపై అధికారుల సూచన మేరకు ఈ ఏడాది జిల్లాలో అధికశాతం మంది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి దిగుబడి కూడా బాగా వచ్చింది. కానీ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏవీ?
మద్దతు ధర లేక ఆందోళన
క్వింటాకు సుమారు రూ.700 దోపిడీ
పాతపట్నం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో పంట మార్పిడిపై అధికారుల సూచన మేరకు ఈ ఏడాది జిల్లాలో అధికశాతం మంది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి దిగుబడి కూడా బాగా వచ్చింది. కానీ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 93 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. సుమారు 3 లక్షల టన్నులకుపైగా దిగుబడి రానుంది. ఒక్క పాతపట్నం నియోజకవర్గంలోనే.. సుమారు 12వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారు. పాతపట్నంలో 7,806 మెట్రిక్ టన్నులు, మెళియాపుట్టిలో 1,093, హిరమండలంలో 2,238, కొత్తూరులో 1,229, ఎల్.ఎన్.పేటలో 2,951 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరాకు గరిష్ఠంగా రూ.25వేల వరకు పెట్టుబడితో 40క్వింటాళ్లు చొప్పున దిగుబడి సాధించారు. జిల్లాలో పాతపట్నం నియోజకవర్గంతోపాటు ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, గార, పొందూరు తదితర మండలాల్లో గతేడాది కన్నా సాగు విస్తీర్ణం పెరిగి.. దిగుబడి బాగుండడంతో రైతులు సంబరపడ్డారు. కానీ దళారుల జోక్యంతో తమకు నష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న పిక్కల కొనుగోలుకు సంబంధించి మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ప్రకటించింది. కానీ ఇంతవరకూ జిల్లాలో ఎక్కడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.1,700 నుంచి రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. మరి రెండు రోజుల్లో ధర రూ.1,500కి పడిపోతుందని ప్రచారం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారుల జోక్యంతో క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నామని, మరోవైపు బస్తాకు సుమారు 4 కేజీల వరకు అదనంగా తూకం వేసి.. దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పంటను దాచుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇటీవల అకాల వర్షాలకు మొక్కజొన్న కంకులు తడిచి రంగు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. తాము కష్టపడి పండిస్తే పెట్టుబడి కూడా రాకపోగా.. దళారులు మాత్రం లాభపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
రూ.1500కే కొనుగోలు
నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసాను. దిగుబడి బాగానే ఉంది. పంట చేతికి వచ్చే సమయానికి దళారులు క్వింటాకు కేవలం రూ.1500 ఇస్తామని చెబుతున్నారు. క్వింటా దగ్గర రూ.900వరకూ నష్టపోతున్నాం. ఇలా అయితే రైతులకు తీవ్రంగా నష్టాన్ని చూడాల్సి వస్తోంది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఆదుకోవాలి.
- బడియాల బాబూరావు, రైతు, కె.గోపాలపురం, పాతపట్నం
ఉన్నతాధికారుల దృష్టికి..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే కూడా చొరవచూపి కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోనున్నారు.
- కె.సింహాచలం, మండల వ్యవసాయాధికారి, పాతపట్నం