Share News

విచారణ సరే.. చర్యలేవీ?

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:48 PM

RGUKT campus in controversy ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఇటీవల జరిగిన పలు సంఘటనలు క్యాంపస్‌ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయి. రెగ్యులర్‌ సిబ్బంది అరకొరగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది.

విచారణ సరే.. చర్యలేవీ?
ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ ్చ

  • వివాదాస్పదంగా ఆర్జీయూకేటీ క్యాంపస్‌

  • బోధన, బోధనేతర సిబ్బంది తీరుపై ఫిర్యాదులు

  • వేధింపులపై కొందరు విద్యార్థినుల ఆరోపణలు

  • రెండు నెలలైనా బాధ్యులపై కానరాని వేటు

  • ఎచ్చెర్ల, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఇటీవల జరిగిన పలు సంఘటనలు క్యాంపస్‌ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయి. రెగ్యులర్‌ సిబ్బంది అరకొరగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. కొత్త డైరెక్టర్ల నియామకం సైతం లేకపోవడంతో.. క్యాంపస్‌లో బోధన, భోదనేతర సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు సైతం ఉన్నతాధికారులకు అందాయి. దీనిపై ఇప్పటికే కమిటీ ద్వారా ఓసారి విచారణ చేసిన ఉన్నతాధికారులు.. ఇటీవల మరోసారి విచారణ చేశారు. కానీ, ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటారో.. లేదోనన్నది చర్చనీయాంశమవుతోంది.

  • ఇదీ పరిస్థితి

  • రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో 2014-19 మఽధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళం, ఒంగోలులో ఆర్జీయూకేటీ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. పీయూసీ -1 విద్యార్థులు మినహా మిగిలిన పీయూసీ-2, ఇంజనీరింగ్‌ నాలుగేళ్ల విద్యార్థులు శ్రీకాకుళం క్యాంపస్‌ (ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురం)లోనే చదువుతున్నారు. పీయూసీ-1 విద్యార్థులు నూజివీడు క్యాంపస్‌లో చదువుతున్నారు. సుమారు 5 వేల మంది విద్యార్థులు ఉండే ఈ క్యాంపస్‌లో పూర్తిస్థాయిలో నిఽఘా లేకపోవడంతో వరుస సంఘటనలు జరుగుతున్నాయి.

  • గతేడాది నవంబరులో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా పలువురు విద్యార్థులు క్యాంపస్‌లో బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. గతేడాది డిసెంబరులో ఇంజనీరింగ్‌ విద్యార్థినులపై కొంతమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేధించారని ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులకు ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు పంపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌ రాయపాటి శైలజ.. గతేడాది డిసెంబరు 17న క్యాంపస్‌ను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి ఆత్మస్థైర్యం నింపారు. వేధింపులకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఉన్న పోక్సో, ఫోష్‌ చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అదే రోజు ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి క్యాంపస్‌ను పరిశీలించి.. విద్యార్థినులతో, సిబ్బందితో వేర్వేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీరి సందర్శన ఫలితంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి విచారణ చేశారు. కానీ ఇంతవరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదు.

  • తాజాగా మరోసారి ఆర్జీయూకేటీ అధికారులు ఆరుగురు సభ్యులతో అంతర్గత కమిటీ నియమించారు. ఆ కమిటీ సభ్యులు ఈ నెల 18, 19 తేదీల్లో క్యాంపస్‌ను పరిశీలించి.. విచారణ చేశారు. విద్యార్థినులను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది బోధన, బోధనేతర సిబ్బంది నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. ఈ కమిటీ నివేదికను ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. కాగా ఈసారైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటారో.. లేదోనన్న చర్చ సాగుతోంది. అంతర్గత కమిటీ కాకుండా సీనియర్‌ ప్రొఫెసర్‌లతోనో, ఇతర వర్సిటీలకు చెందిన సీనియర్‌ ఆచార్యులతోనో విచారణ చేస్తే మరిన్ని లోతైన వివరాలు బయటపడేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • అరకొరగా రెగ్యులర్‌ సిబ్బంది

  • ఈ క్యాంపస్‌లో నలుగురు.. ఐదుగురు మాత్రమే రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. కీలక బాధ్యతలను కూడా తాత్కాలిక సిబ్బందితో పూర్తిచేయించాల్సిన పరిస్థితి ఉంది. రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు క్యాంపస్‌ల డైరెక్టర్లు రాజీనామా చేశారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో ఇంకా వీరే డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో డైరెక్టర్‌ పదవి ఖాళీ చేయాల్సి వస్తుందో తెలియక వారు కూడా పాలనపై పూర్తి స్థాయిలో బాధ్యత వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

  • పూర్తిస్థాయి నిఘా అవసరం

  • ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలి. ఇంత పెద్ద క్యాంపస్‌లో అవసరమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడపడితే అక్కడ చెక్‌ విధానం అమలు చేస్తే చిల్లర చేష్టలకు పుల్‌స్టాప్‌ పెట్టొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కట్టుదిట్టమైన చర్యలతో క్యాంపస్‌ను నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:48 PM