Share News

వర్షం పడితే ముంపే

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:37 AM

సాధారణంగా జాతీయ రహదారి అంటే ప్రయాణం సాఫీగా సాగిపోవాలి. కానీ, జిల్లాలో మాత్రం హైవేపై ప్రయాణం నరకమే.

వర్షం పడితే ముంపే
లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్‌ వద్ద ఇలా..

- జాతీయ రహదారిపై నిలిచిపోతున్న నీరు

- కాలువలకు వెళ్లే మార్గం లేక నిల్వ

- ఏటా వానాకాలంలో తప్పని కష్టాలు

- ఈఏడాదైనా పరిస్థితి మారేనా?

- లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్‌ వద్ద చిన్నపాటి వర్షానికే జాతీయ రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంటుంది. వర్షంపడితే రోజంతా నీరు నిల్వ ఉంటుంది. లోతట్టు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి వంతెన కిందన నిల్వ ఉండిపోతుంది. ఆ సమయంలో వాహన చోదకులు, ప్రయాణికులు పడే బాధలు వర్ణనాతీతం. అక్కడ హైవే వరద నీరును కాలువల్లోకి మళ్లించేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదు. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

- ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వంతెన కింద భాగంలొ ఏటా వర్షాకాలంలో దుస్థితి ఇది. ఇక్కడ వంతెన నుంచి వరద నీరు ఇలా కింది భాగానికి పోటెత్తుతుంది. నీరు వెళ్లే మార్గం లేక ఇలా సర్వీసు రోడ్డుపైకి దూసుకొస్తుంటుంది. ఆ సమయంలో వాహన చోదకులు, ప్రయాణికులు పడే బాధలు అన్నీఇన్నీ కావు.

రణస్థలం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా జాతీయ రహదారి అంటే ప్రయాణం సాఫీగా సాగిపోవాలి. కానీ, జిల్లాలో మాత్రం హైవేపై ప్రయాణం నరకమే. వర్షం పడితే జాతీయ రహదారిపై ప్రయాణించేవారికి, సమీపంలో నివాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారి నిర్మాణ సమయంలో లోపాలు, పూర్తిస్థాయి నిర్వహణ లేకపోవడంతో వర్షాలకు కొన్నిచోట్ల రోడ్డు నీట మునుగుతుంది. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలూ జరుగుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ 196 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకూ ఆరు వరుసలుగా 54 కిలోమీటర్ల రోడ్డు ఉంది. అక్కడ నుంచి ఇచ్ఛాపురం మాత్రం నాలుగు వరుసలుగా 85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మధ్యలో రణస్థలం మండల కేంద్రంలో ఇప్పుడు ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారిపై 30 వంతెనలు ఉన్నాయి. 80 కిలోమీటర్ల మేర సైడ్‌ కాలువలు ఉన్నాయి. అయితే ఇరువైపులా సర్వీసు రోడ్లు, పై వంతెనలు, కాలువలు కూడా ఉన్నాయి. కానీ వర్షంపడితే కొన్నిచోట్ల నీరు నిలిచిపోతోంది. నిర్మాణ సమయంలో సరైన ప్రణాళిక, నిబంధనలు పాటించకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు రావడం, అధికారులు హడావుడి చేయడం, తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది.

కానరాని పర్యవేక్షణ..

జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను టోల్‌ వసూలు చేసే కాంట్రాక్ట్‌ సంస్థలు చూడాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. గతుకులు, గుంతలు ఉన్న ప్రాంతంలో మరమ్మతులు చేయడం, మొక్కల పరిరక్షణ, విద్యుద్దీపాలంకరణ, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడం వంటివి చేయాలి. కానీ, జిల్లాలో మాత్రం తూతూమంత్రంగా జరుపుతున్నట్టు విమర్శలున్నాయి. సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఉన్న కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం లేదు. దీంతో వరద నీరు వెళ్లే మార్గం లేక సర్వీసు రోడ్లపై నీరు నిల్వ ఉండిపోతోంది. అటువైపుగా వెళ్లే వాహనాలపై వరద నీరు పడుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదాలకు కూడా ఇవే కారణాలు అవుతున్నాయి. అయితే సమస్య తలెత్తిన చోట తాత్కాలికంగా పనులు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాదైనా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

సక్రమంగా లేని కాలువలు..

రణస్థలం మండలం పైడిభీమవరం, కోష్ఠ, పతివాడపాలెం, నెలివాడ కూడళ్లలో ఫ్లైఓవర్ల వద్ద సర్వీసు రోడ్లను సక్రమంగా నిర్మించలేదు. ఇక్కడ కాలువలు కూడా సక్రమంగా లేవు. నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోతోంది. లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్‌, ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస, చిలకపాలెం, కేశవరావుపేట, నవభారత్‌ జంక్షన్‌ వద్ద కూడా అదే పరిస్థితి. నరసన్నపేట మండల కోమర్తి, సింగుపురం జంక్షన్‌ వద్ద సైతం వరద నీరు పోటెత్తుతోంది. అయితే ఇంత జరుగుతున్నా హైవే అధికారులు తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారు.

వెలగని విద్యుత్‌ లైట్లు..

జాతీయ రహదారికి సంబంధించి 30 వంతెనల వద్ద, గ్రామాలకు వెళ్లే సర్వీసు రోడ్ల వద్ద దాదాపు 900 విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటుచేశారు. వాటికి ఎల్‌ఈడీ విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఇవి బాగానే వెలిగాయి. కానీ తరువాత నిర్వహణ బాగా లేకపోవడంతో వెలగడం మానేశాయి. రణస్థలంలో అయితే రోడ్డు మధ్యలో వేసిన విద్యుత్‌ స్తంభం పక్కకు ఒరిగిపోయింది. ఎప్పుడు రోడ్డుపై పడుతుందో తెలియని పరిస్థితి. బుడుమూరు, సుభద్రాపురం, తాళ్లవలస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సింహద్వారం, పెద్దపాడు, సింగుపురం, మడపాం వద్ద పూర్తిస్థాయిలో విద్యుత్‌ లైట్లు వెలగడం లేదు. చాలాచోట్ల ఈ దీపాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఫ్యూజు బాక్సులు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికైనా జాతీయ రహదారి విభాగం అధికారులు వంతెనలు, సర్వీసు రోడ్ల వద్ద సూచికబోర్డులు, విద్యుత్‌ లైట్లు వేయాల్సిన అవసరముంది.

భయం వేస్తోంది..

వర్షాకాలంలో హైవేపై ప్రయాణమంటేనే భయం వేస్తోంది. ఎక్కడి వరద నీరు అక్కడే నిలిచిపోతోంది. కనీసం నీటిని కాలువల్లోకి మళ్లించే పనులు చేపట్టడం లేదు. కనీసం ఈ ఏడాది ఇబ్బందులు లేకుండా చూడాలి. వాహనదారుల కష్టాలను తీర్చాల్సిన అవసరం ఉంది.

-ఆర్‌.సాయి, వాహనదారుడు, రణస్థలం

Updated Date - Jul 02 , 2026 | 12:37 AM