Share News

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:36 PM

అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఆంధ్రాతో పాటు తెలంగాణలో 28 దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ

- ఆంధ్ర, తెలంగాణలో 28 దొంగతనాలు

- 48 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఆంధ్రాతో పాటు తెలంగాణలో 28 దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను ఆదివారం ఇచ్ఛాపురం సర్కిల్‌ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నమనాయుడు విలేకరులకు వెల్లడించారు. గత నెల 9న ఇచ్ఛాపురం పట్టణంలోని అప్పన్నపేటలో రెండు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. తులం పావు బంగారంతో పాటు రూ.6,500 నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్‌ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట గ్రామానికి చెందిన కొండలోల సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రాతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయికుమార్‌ 28 దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం ఏడు కేసుల్లో (ఇచ్ఛాపురం-2, మెళియాపుట్టి, జీఆర్‌పురం, నరసన్నపేట, ఆమదాలవలస, విజయనగరంటౌన్‌) నిందితుడిగా ఉన్న సాయికుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. చోరీచేసిన బంగారు ఆభరణాలు పట్టుకొని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు వచ్చి ట్రైన్‌ కోసం వేచి ఉండగా పట్టుకున్నామన్నారు. సాయికుమార్‌ నుంచి 48గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, క్రైం కానిస్టేబుల్‌ బషీర్‌ పాల్గొన్నారు

Updated Date - Feb 22 , 2026 | 11:36 PM