Share News

ఏప్రిల్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:08 AM

Intermediate classes ఇంటర్‌ విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, పరీక్షల వివరాలను తెలియజేస్తూ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ ఒకటి నుంచి తరగుతులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహణ

జూన్‌ ఒకటి నుంచి జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభం

‘సెకెండియర్‌’కు కొత్త సిలబస్‌

నరసన్నపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, పరీక్షల వివరాలను తెలియజేస్తూ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ ఒకటి నుంచి తరగుతులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. అకడమిక్‌ క్యాలెండర్‌లో 314 రోజులకు గాను 232 పనిదినాలు,82 సెలవు దినాలు అందులో పేర్కొంది. జిల్లాలో 164 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలు -38, ప్రైవేటు కళాశాలలు -71, మోడల్‌స్కూల్స్‌-13, కేజీబీవీలు -25, సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు -9, ట్రైబల్‌ వెల్ఫేర్‌ -1, ఇతర కళాశాలలు -7 ఉన్నాయి. ఈ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరానికి రానున్న విద్యార్థులు 19,850 మంది ఉన్నారు. వీరందరికీ ఏప్రిల్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. అదే నెల 24 నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తారు. జూన్‌ 1 నుంచి జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభిస్తారు. అక్టోబరు 5 నుంచి 9 వరకు త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబరు 10 నుంచి 20 వరకు దసరా సెలవులు ఇస్తారు. నవంబరు 25 నుంచి 30 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి 9 నుంచి 17వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు. 2027 జనవరి 19 నుంచి 23 వరకు ఫ్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌ , ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది కొత్త సిలబస్‌ను బోధించనున్నట్టు ఆర్‌ఐవో సురేష్‌కుమార్‌ తెలిపారు. అభ్యసనా సామర్థ్యాలను పెంచడంతోపాటు జాతీయస్థాయి ప్రమాణాలతో ఇంటర్‌విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు మార్పులు చేసిందన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 12:08 AM