Inter Exams: ముగిసిన ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:26 AM
Inter Exams:జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 23న ప్రారంభమైన పరీక్షలు బుధవారం వరకు జరిగాయి.
- ఇంటిబాట పట్టిన హాస్టల్ విద్యార్థులు
- ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం
నరసన్నపేట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 23న ప్రారంభమైన పరీక్షలు బుధవారం వరకు జరిగాయి. మొత్తం 71 కేంద్రాల్లో పరీక్షలను ఇంటర్ బోర్డు అధికారులు నిర్వహించారు. ప్రథమ సంవత్సరం 19,850 మంది, ద్వితీయ సంవత్సరం 19,988 మంది మొత్తంగా 39,838 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,349 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో కొందరు ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అక్కడే శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు కామర్స్ విద్యార్థులు సీఏ ఫౌండేషన్ కోర్సు పరీక్షలను రాసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని దుప్పలవలస, తామరాపల్లి, ఎచ్చెర్ల, నందిగాం, కంచిలి తదితర ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు గతంలో మాదిరిగా ప్రభుత్వమే ఎంసెట్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి ఇంటిబాట పట్టారు.