Share News

ముంపు పొలాలను పరిశీలించండి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:47 PM

Awareness regarding crop protection must be created ముంపు పొలాల్లో వరిపంట రక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యుత్‌శాఖ, ఐటీడీఏ, ఇంజనీరింగ్‌ అధికారులతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు.

ముంపు పొలాలను పరిశీలించండి
వ్యవసాయశాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • పంట రక్షణపై అవగాహన కల్పించాలి

  • మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

  • కోటబొమ్మాళి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ముంపు పొలాల్లో వరిపంట రక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యుత్‌శాఖ, ఐటీడీఏ, ఇంజనీరింగ్‌ అధికారులతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. ‘ఇటీవల తుఫాన్‌ ప్రభావంతో ముంపునకు గురైన వరిపంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నష్టం అంచనా వేయండి. సాధ్యమైనంతవరకూ పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాల’ని మంత్రి అచ్చెన్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశించారు. అవసరమైతే వ్యవసాయ డ్రోన్లును వినియోగించాలని సూచించారు. పోషక యాజమాన్యం, తెగుళ్లు, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

  • త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను విస్తరించాలి

  • టెక్కలి నియోజకవర్గంలో ప్రధాన గ్రామాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకుగానూ సంతబొమ్మాళి సెక్షన్‌ పాతమేఘవరం, కోటబొమ్మాళి సెక్షన్‌ జర్జంగి, జీయన్నపేట, టెక్కలి సెక్షన్‌ జగతిమెట్ట ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.

  • రహదారి పనులు వేగవంతం

  • టెక్కలి నియోజకవర్గ పరిధిలోని గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ, డాక్టర్‌ సి.హెచ్‌ ముకుందరావు, డాక్టర్‌ భాగ్యలక్ష్మి, డాక్టర్‌ పి.ఉదయబాబు, శ్రీకాకుళం వ్యవసాయ సంచాలకులు జగన్మోహన్‌రావు, టెక్కలి వ్యవసాయ సంచాలకులు ఎన్‌.శ్రీనివాస్‌రావు, మండల వ్యవసాయాధికారి ఆర్‌. అప్పారావు, విద్యుత్‌ శాఖ ఈఈ జి.ఎన్‌.ప్రసాద్‌, డీఈ నరసింహా, ఈఈ రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:47 PM