పరిశ్రమలు తెరవక.. ఉపాధిలేక
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:32 AM
Cashew industries shut down in Palasa పలాసలో జీడి ఉత్పత్తులకు కష్టకాలం వచ్చింది. అమ్మకాలు లేక సరకులు నిల్వ ఉండిపోవడంతో వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఫలితంగా పరిశ్రమలు గాడిలో పెట్టడానికి, నిల్వలు అమ్ముకోవడానికి వీలుగా జూలై 24 నుంచి వ్యాపారులు బంద్ చేస్తున్నారు. కాగా పరిశ్రమల బంద్ వల్ల వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక రోడ్డునపడిన పరిస్థితి ఏర్పడింది.
పలాసలో జీడి పరిశ్రమలు బంద్
వేలాది మంది కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు
వ్యాపారాలు లేక యజమానుల అవస్థలు
వారం రోజులైనా మారని పరిస్థితులు
పలాస, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పలాసలో జీడి ఉత్పత్తులకు కష్టకాలం వచ్చింది. అమ్మకాలు లేక సరకులు నిల్వ ఉండిపోవడంతో వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఫలితంగా పరిశ్రమలు గాడిలో పెట్టడానికి, నిల్వలు అమ్ముకోవడానికి వీలుగా జూలై 24 నుంచి వ్యాపారులు బంద్ చేస్తున్నారు. కాగా పరిశ్రమల బంద్ వల్ల వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక రోడ్డునపడిన పరిస్థితి ఏర్పడింది.
పలాస అంటేనే జీడిపప్పు. ఇక్కడ వందలాది మంది వ్యాపారులు జీడిపరిశ్రమలు నిర్వహిస్తున్నారు. వీటిద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కొన్ని నెలల కిందట ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో జీడి పరిశ్రమలకు గడ్డుకాలం ప్రారంభమైంది. నెలల తరబడి యుద్ధం జరుగుతుండడంతో ఇతర దేశాలకు జీడిపప్పు ఎగుమతి పూర్తిగా నిలిచిపోయింది. వేలాది టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. వ్యాపారులు వీటిని దేశీయంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీడి పిక్కల ధరలు పెరగడం, అందుకు తగిన విధంగా పప్పురేట్లు పెరగకపోవడంతో జీడి పరిశ్రమల పతనం ప్రారంభమైంది. గత ఏడాది ఇదే పరిస్థితి ఉన్నా మార్కెట్ ఒడిదుడుకులు తట్టుకొని నిలబడింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు కుదేలయ్యారు.
వ్యాపారుల వేదన
జిల్లాలో సుమారు 350 జీడి పరిశ్రమలు ఉండగా ఒక్క పలాసలోనే 200కు పైగా పరిశ్రమలు, వెయ్యి మంది వరకూ వ్యాపారులు ఉన్నారు. విక్రయాలు లేక వ్యాపారుల వద్ద జీడిపప్పు నిల్వలు పేరుకుపోయాయి. కొత్తగా ఉత్పత్తి చేస్తే ఉన్న సరకులు మగ్గిపోవడం తప్ప.. ఆశించినంతగా లాభాలు రావు. ఈ నేపథ్యంలో వ్యాపారులు పరిశ్రమల బంద్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు కొంచెం లాభాలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న పది మంది వరకూ దళారులు(బ్రోకర్లు) కూడా జీడిపప్పు కొనుగోలుపై ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అరువు ప్రాతిపదికన జీడిపప్పును కొనుగోలు చేస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
కార్మికుల ఆవేదన
జీడిపరిశ్రమల బంద్ ప్రభావం కార్మికులపై తీవ్రంగా పడింది. పలాసలోని జీడిపరిశ్రమల్లో 16 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటారని అంచనా. వారు ప్రతి రోజు రూ.400 నుంచి స్థాయిని బట్టి రూ.వెయ్యి వరకూ కూలి పొందుతారు. పరిశ్రమలు బంద్‌తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘ నాయకులు కూడా ఆచుతూచి అడుగులు వేస్తున్నారు. వ్యాపారులతో ఒప్పందం ప్రకారం పనిదినాలు కల్పించాలి. ఆ నిబంధన అతిక్రమిస్తే మాత్రం తాము పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. పరిశ్రమలు తెరిచి.. కార్మికులకు యథావిధిగా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై పారిశ్రామికవాడ వ్యాపార సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు మాట్లాడుతూ ‘వారం రోజుల బంద్‌తో నష్టాల శాతం కొంతమేర తగ్గింది. ప్రస్తుతం జీడిపిక్కల రేట్లు పెరగడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్నాం. మరో మూడు రోజులపాటు బంద్ కొనసాగుతుంది. తర్వాత పరిశ్రమలు తెరిచే అవకాశం ఉంద’ని తెలిపారు.
పరిశ్రమలు తెరిపించాలి
గతంలో ప్రతి జీడి పరిశ్రమ కనీసం ఏటా 500 బస్తాలకు తగిన విధంగా కార్మికులకు పని కల్పించేది. ప్రస్తుతం ఏడాది పొడవునా పరిశ్రమలు తెరిపించి పనులు కల్పిస్తున్నారు. అర్ధాంతరంగా పరిశ్రమలు బంద్ చేయకూడదు. వ్యాపారుల ఇబ్బందులు అర్థం చేసుకోగలం. కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తే వారి కుటుంబాలకు తిండి దొరుకుతుంది. పనులు లేకపోతే పస్తులు ఉండాల్సిందే. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకొని పరిశ్రమలు తెరిపించాలి.
- అంబటి కృష్ణమూర్తి, జీడి కార్మికసంఘ అధ్యక్షుడు, పలాస
వారం రోజులుగా పనుల్లేవ్
వారం రోజులుగా పనులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. రోజూ రూ.350 వరకూ జీడిపిక్కల పీలింగ్ ద్వారా ఆదాయం పొందుతున్నాను. వ్యాపారులు స్పందించి పరిశ్రమలు తెరిచి ఉపాధి కల్పించాలి.
- అనూష, జీడి కార్మికురాలు, నెమలిగ్రామం..