Share News

సిక్కోలు నుంచే పారిశ్రామిక ప్రగతి

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:07 AM

‘East Coast Industrial Corridor’ begins from Moolapet వెనుకబాటుకు కేరాఫ్‌గా ఉన్న సిక్కోలు.. పారిశ్రామిక ప్రగతికి ముఖద్వారంగా మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పారిశ్రామిక విధానాల్లో సిక్కోలుకు సింహభాగం దక్కనుంది. ఇటీవల అమరావతిలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు జిల్లా భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

సిక్కోలు నుంచే పారిశ్రామిక ప్రగతి
మూలపేటలో నిర్మిస్తున్న పోర్టు

  • జిల్లా ముఖచిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

  • ఉత్తరాంధ్ర ‘రేర్‌ ఎర్త్‌ కారిడార్‌’లో శ్రీకాకుళానికి పెద్దపీట

  • మూలపేట నుంచే ‘ఈస్ట్‌ కోస్ట్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌’ ప్రారంభం

  • విలువైన ఖనిజాల వెలికితీత, వాల్యూ చైన్‌ పరిశ్రమలపై దృష్టి

  • అధికారులకు దిశానిర్దేశం.. త్వరలో ప్రతిపాదనలు

  • శ్రీకాకుళం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): వెనుకబాటుకు కేరాఫ్‌గా ఉన్న సిక్కోలు.. పారిశ్రామిక ప్రగతికి ముఖద్వారంగా మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పారిశ్రామిక విధానాల్లో సిక్కోలుకు సింహభాగం దక్కనుంది. ఇటీవల అమరావతిలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు జిల్లా భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రాజెక్టులను ఉత్తరాంధ్రలో.. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.

  • జిల్లాకు దక్కిన ప్రాధాన్యతలివీ..

  • రేర్‌ఎర్త్‌ కారిడార్‌: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మీదుగా అరుదైన ఖనిజాల కారిడార్‌

  • పరిశ్రమల స్థాపన: ఖనిజాల వెలికితీతతోపాటు, ప్రాసెసింగ్‌ యూనిట్లు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా ప్రణాళిక

  • కారిడార్‌ విస్తరణ : మూలపేట(శ్రీకాకుళం) నుంచి కృష్ణపట్నం(నెల్లూరు) వరకు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి

  • మూలపేట.. ఇక ఇండస్ట్రియల్‌ గేట్‌వే!

  • జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో నిర్మిస్తున్న మూలపేట పోర్టు కేంద్రంగా భారీ పారిశ్రామిక కారిడార్‌ రూపుదిద్దుకోనుంది. ‘ఈస్ట్‌కోస్ట్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌’ (తూర్పు తీర పారిశ్రామిక కారిడార్‌) ఏర్పాటులో భాగంగా.,. తీరప్రాంతంలోని మూలపేట నుంచి దిగువున ఉన్న కృష్ణపట్నం వరకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంటే రాష్ట్రవ్యాప్త పారిశ్రామిక కారిడార్‌కు మూలపేట పోర్టు ప్రారంభ స్థానం కానుంది. దీనివల్ల పోర్టు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్‌ రంగాలు జిల్లాలో భారీగా విస్తరించే అవకాశం ఉంది.

  • ‘రేర్‌ ఎర్త్‌’.. సిక్కోలుకు వర్త్‌!

  • శ్రీకాకుళం తీరప్రాంతం అరుదైన ఖనిజాలకు (బీచ్‌ శాండ్‌ మినరల్స్‌) ప్రసిద్ధి. ఇన్నాళ్లూ ఈ ఖనిజాలను వెలికితీసి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. కానీ, సీఎం తాజా ఆదేశాలతో ఆ పరిస్థితి మారనుంది. కేంద్రం ప్రకటించిన ‘రేర్‌ ఎర్త్‌ కారిడార్‌’ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. కేవలం ఖనిజాల వెలికితీతకే పరిమితం కాకుండా.. వాటికి సంబంధించిన ‘వాల్యూ చైన్‌’(విలువ ఆధారిత) పరిశ్రమలను ఇక్కడే స్థాపించాలని సూచించారు. దీనివల్ల స్థానికంగానే శుద్ధి కర్మాగారాలు, అనుబంధ పరిశ్రమలు వచ్చి, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.

  • కంటైనర్‌ హబ్‌గా..

  • పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కంటైనర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎక్విప్‌మెంట్‌ మాన్యుప్యాక్చరింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నత అధికారులను ఆదేశించారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తుండటంతో కంటైనర్‌ తయారీ పరిశ్రమలకు శ్రీకాకుళం అనువైన ప్రాంతంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా సీఎం తాజా సమీక్ష.. వలస జిల్లాలో పరిశ్రమల శంఖారావానికి నాంది పలికినట్లయిందని పేర్కొంటున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:07 AM