Share News

ఉప్పొంగిన దేశభక్తి

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:25 AM

Independence Celebrations జిల్లావాసుల్లో దేశభక్తి ఉప్పొంగింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఉప్పొంగిన దేశభక్తి
శ్రీకాకుళంలో జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు. చిత్రంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • అంబరాన్నంటిన స్వాతంత్య్ర వేడుకలు

  • అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

  • ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు

  • ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌/ కల్చరల్‌, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి)ః జిల్లావాసుల్లో దేశభక్తి ఉప్పొంగింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కోటబొమ్మాళి మండలం చిట్టివలసకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కరుకోల వెంకటపతి సతీమణి అమ్మాయమ్మను మంత్రి అచ్చెన్నాయుడు ఆప్యాయంగా పలుకరించారు. ఆమెను శాలువాతో సత్కరించి, మెమొంటోను అందజేశారు.

  • సమగ్రాభివృద్ధే ధ్యేయం : మంత్రి అచ్చెన్నాయుడు

  • ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌’ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు దార్శనికత పాలన సాగుతోంది’ అని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీకాకుళంలో ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జీరో పావర్టీ’, నీటి భద్రత, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత తదితర 12 కీలక అంశాలతో విజన్‌-2047 అజెండాను రూపొందించినట్లు తెలి పారు. జిల్లా అభివృద్ధిని వివరిస్తూ అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు అందించడంతో పాటు, ఉచిత పంటల బీమా, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నా మన్నారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వందల కోట్ల మేర ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామ న్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ జిల్లాలో ఇప్పటికే 95 శాతం మందికి ‘ఆబా’ కార్డుల ప్రక్రియ పూర్తి చేశామని తెలి పారు. రోడ్లు, సాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ, అందరి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

  • అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

  • స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్యర్యంలో 1200 మంది విద్యార్థులు విన్యాసాలను రిథమిక్‌గా ప్రదర్శించారు. న్యూసెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థుల ‘జయజయభారత జనని’ గేయనృత్య ప్రదర్శన భారతవనిని కళ్లముందుంచింది. బెహరా మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక దివ్యాంగ విద్యార్థుల ‘పుణ్యభూమి నా దేశం’ గేయరూపకం ఆకట్టుకుంది. గీతాంజలి పబ్లిక్‌స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన కత్తి, కర్రసాము విన్యాసాలు ఔరా అనిపించాయి. ఈ మూడూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. అలాగే డా.బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ విద్యార్థులు, పెదపాడులోని ఏపీ రెసిడెన్షియల్‌ విద్యార్థుల నృత్యరూపకాలు దేశభక్తిని చాటిచెప్పాయి. ఐటీడీఏ పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేతలకు మంత్రి అచ్చెన్న చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

  • ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు...

  • వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ శకటాలు సంక్షేమం, అభివృద్ధిని సూచిస్తూ ముందుకు సాగాయి. మొత్తం 11 విభాగాలకు చెందిన ప్రభుత్వ శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో జిల్లా విద్యాశాఖ శకటానికి ప్రథమస్థానం, పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ శకటానికి ద్వితీయ స్థానం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) శకటానికి తృతీయ స్థానం లభించింది. ఆయా శాఖలకు చెందిన అధికారులకు మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి అచ్చెన్నతోపాటు కలెక్టర్‌, ఎస్పీ, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌ తదితరులు పరిశీలించారు.

Updated Date - Aug 16 , 2026 | 12:25 AM