‘పెంచిన పెట్రో ధరలను తగ్గించాల్సిందే’
ABN , Publish Date - May 18 , 2026 | 11:45 PM
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు డిమాండ్ చేశారు.
అరసవల్లి/శ్రీకాకుళం అర్బన్, మే 18(ఆంధ్రజ్యోతి): పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రామలక్ష్మణ జంక్షన్, పాతబస్టాండ్ వద్ద వేర్వేరుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యుద్ధం నెపంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచడంతో చిరు వ్యాపారులు సిలిండర్లు లభ్యం కాక వ్యాపారాలను కోల్పోయారని, ప్రస్తుతం పెట్రో ధరలు పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలు ఫలితాల తరువాత ఈ విధంగా ధరలు పెంచి మోసం చేశారని విమర్శించారు. కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, సీపీఐ నాయకులు ఆర్.అరవింద్, కూన వసంత్, కె.తులసీరావు, అప్పన్న, చిన్నబాబు, లబ్బ రాజు, జి.రమణ మూర్తి, బమ్మిడి రాజు తదితరులు పాల్గొన్నారు.
పెట్రో ధరల పెంపుపై వైసీపీ నిరసనలు
శ్రీకాకుళం అర్బన్, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాత్రమే పెట్రో ల్, డీజిల్ ధరలు ఎక్కువగా పెరిగా యని, ఏ ఇతర రాష్ర్టాల్లో కూడా ఇంత ధరలు లేవని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పెరిగిన ధరలకు నిరసనగా నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యా లయంలో వినతిపత్రం అందించారు. పెట్రోల్ ధరలు పెరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్య మేనని కారణమని విమర్శించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపాయి. ఇచ్ఛాపురంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామా రావు, ఆమదా లవలసలో ఇన్‌చార్జి చింతాడ రవికుమార్, లావేరులో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. లావేరులో ఆటోకు తాడుని కట్టి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. టెక్కలిలో వైసీపీ ఇన్‌చార్జి పేడాడ తిలక్, నరసన్నపేటలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలను అందించారు.