ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచండి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:33 AM
ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించి..ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఈవీవీ నరేష్‌కుమార్ అన్నారు.
జిల్లా వైద్యశాఖాధికారి నరేష్‌కుమార్
పలాస రూరల్/వజ్రపుకొత్తూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించి..ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఈవీవీ నరేష్‌కుమార్ అన్నారు. పలాస మండలం వెంకటాపురం, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరాలని, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు 100శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉత్తమ సేవలందించాలని అన్నారు. సమయ పాలన పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు టి.సునీల్‌కుమార్, సంపత్ కుమార్, పిన్నింటి దేవి, జిల్లా అధికారి వెంకటరావు, ఫార్మసీ అధికారి బోనెల గోపాల్, గిరిశంకర్, పద్మావతి, సరస్వతి, సుహాసిని పాల్గొన్నారు.