భూముల విలువ పెంపు
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:18 AM
Lands value Increase in city జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఈ నెలాఖరు వరకే పాత రేట్లు
శ్రీకాకుళం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ విలువలను సవరించడం(పెంచడం) ఇది రెండోసారి. ఇప్పటికే ఇసుక, సిమెంట్, నిర్మాణ సామగ్రి ధరలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలపై.. తాజాగా భూముల విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీల భారం పడనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మార్కెట్ విలువల సవరణపై కసరత్తు ముమ్మరం చేశారు.
ఎక్కడెక్కడంటే..
భూముల మార్కెట్ విలువ పెంపుదల కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం. గ్రామీణ ప్రాంతాలకు ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చారు. దీంతో జిల్లాలోని కీలక వాణిజ్య, నివాస ప్రాంతాలైన శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు.. ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఉమ్మడి జిల్లా పరిధి రాజాం మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీల పరిధిలో భూముల విలువలు ఫిబ్రవరి 1 నుంచి మారనున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసే పేరుతో ఈ పెంపు ఉండనుంది.
భారీగా ఓపెన్ మార్కెట్..
భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగవంతం కావడం, జాతీయ రహదారి విస్తరణ, మూలపేట పోర్టు వంటి పరిణామాలతో శ్రీకాకుళం జిల్లాలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం నగర శివారు ప్రాంతాలు, ఎచ్చెర్ల, పలాస, రాజాం వంటి ప్రాంతాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో (బుక్ వాల్యూ) మాత్రం తక్కువగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పెరగడం వల్లే డిమాండ్ పెరిగిందని, అందుకే ప్రభుత్వ విలువను కూడా వాస్తవ ధరకు దగ్గరగా తీసుకువెళ్లేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఖజానా నింపుకొనేందుకే ...
రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆశించిన మేర రాబడి రావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.13,150 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. గతేడాది నవంబరు నాటికి సగం మాత్రమే (రూ.7,132 కోట్లు) వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్న తరుణంలో.. లక్ష్యం చేరుకునేందుకు పట్టణ ప్రాంతాల్లో భూముల విలువల పెంపు అస్త్రంగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులకు క్యూ...
ఈ నెల 31 వరకు మాత్రమే పాత రేట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈలోగానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొంతమంది కొనుగోలుదారులు ఆసక్తి చూపనున్నారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీకాకుళం, రాజాం, పలాస, చీపురుపల్లి(జిల్లా సరిహద్దు వాసులు) తదితర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు రెండు నెలల్లో మార్కెట్ విలువల సవరణ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా పట్టణ వాసులపై ఈ నిర్ణయం గట్టి ప్రభావమే చూపనుంది.