50 నుంచి 60కి పెంపు
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:16 AM
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్య పెరగడంతో నగర ముఖచిత్రం మారనుంది.
-శ్రీకాకుళం కార్పొరేషన్‌లో సమూల మార్పులు
-నేటి నుంచే డీలిమిటేషన్.. పది రోజుల్లో ప్రక్రియ పూర్తి
-2011 జనాభా.. 026 జనవరి1 ఓటర్ల జాబితాయే ప్రామాణికం
-అక్టోబరు 16న రాష్ట్ర గెజిట్‌లో తుది నోటిఫికేషన్
శ్రీకాకుళం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్య పెరగడంతో నగర ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం ఉన్న 50 వార్డులను 60కి పెంచుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్‌కుమార్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త వార్డుల ఏర్పాటుకు బుధవారం నుంచే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
డీలిమిటేషన్‌కు ఇవే ప్రామాణికాలు
2011 జనాభా లెక్కలను వార్డుల పునర్విభజనకు ప్రామాణికంగా తీసుకోనున్నారు. అలాగే 2026 జనవరి 1 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని సీడీఎంఏ ఆదేశించింది. నగర భౌగోళిక సరిహద్దుల్లోని ఈశాన్య ప్రాంతం నుంచి గడియారం ముల్లు తిరిగే దిశలో వార్డుల విభజన, నంబరింగ్ చేపట్టాలి.
వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించకుండా చూడాలి. సహజ సరిహద్దులు, సర్వే నంబర్లు, ప్రధాన కూడళ్లు, వీధులను పరిగణనలోకి తీసుకుని వార్డుల సరిహద్దులను నిర్ణయించాలి. డీలిమిటేషన్ ప్రతిపాదనలపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సీడీఎంఏ ఆదేశించింది.
పది రోజుల్లోనే పూర్తి
డీలిమిటేషన్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించి వేగంగా పూర్తి చేయాలని సీడీఎంఏ ఆదేశించింది.
అక్టోబరు 7: టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారంతో ముసాయిదా డీలిమిటేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
అక్టోబరు 8 నుంచి 14వరకు: ఫామ్ 1 ద్వారా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ఏడు రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించాలి.
అక్టోబరు 15: ప్రజలు, కార్పొరేషన్ కౌన్సిల్ నుంచి వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిశీలించి తుది ప్రతిపాదనలకు సీడీఎంఏ ఆమోదం తెలపాలి.
అక్టోబరు 16: ఫామ్ 6 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెజిట్‌లో తుది నోటిఫికేషన్ ప్రచురించాలి. డీలిమిటేషన్‌లో మార్గదర్శకాలను ఉల్లంఘించినా, షెడ్యూల్‌లో జాప్యం చేసినా లేదా నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ హెచ్చరించింది. దీంతో శ్రీకాకుళం కార్పొరేషన్ యంత్రాంగం డీలిమిటేషన్ పనులను వేగవంతం చేసింది.